వెబ్‌సైట్ సృష్టికర్త పోలీసు ఉద్యోగి!

15 Jan, 2016 03:31 IST|Sakshi
వెబ్‌సైట్ సృష్టికర్త పోలీసు ఉద్యోగి!

 ‘ఆర్థిక’ కోణాలు తేలాకే అరెస్టుపై నిర్ణయం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించిన నిజామాబాద్ జిల్లావాసి క్రాంతికుమార్ ‘పోలీసు ఉద్యోగే’ నని సమాచారం. నవీపేట్‌కు చెందిన కాంత్రికుమార్ అక్కడ ఓ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడని తెలిసింది. నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, కేవలం రేటింగ్స్ ద్వారా ఆన్‌లైన్ యాడ్స్ పొందడానికి మాత్రమే నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించానని వెల్లడించినట్లు తెలిసింది.

మరోపక్క ఓ వైబ్‌సైట్‌తో సారూప్యత ఉన్న మరో సైట్‌ను సృష్టించడం నేరమేనా? పోలీసు లోగోను నకిలీ వెబ్‌సైట్‌పై వినియోగించడం కాపీరైట్ యాక్ట్ పరిధిలోకి వస్తుందా? తదితర న్యాయపరమైన అంశాలను అధికారులు ఆరా తీస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు చెల్లించిన ఫీజు ఏ ఖాతాలోకి వెళ్లిందనేది కీలకంగా మారింది. ఈ వివరాలన్నీ బయటపడిన తరవాతే నిందితుడిపై చర్యలకు సంబంధించి పోలీసులు తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. తాను గతంలో పోలీసు కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ విధులు నిర్వర్తించానని, ప్రస్తుతం మానేశానని క్రాంతికుమార్ చెప్తున్నాడని ఓ అధికారి తెలిపారు.

>
మరిన్ని వార్తలు