ఎయిర్ ‘బస్సు’లో గొడవ

24 Jan, 2016 03:58 IST|Sakshi
ఎయిర్ ‘బస్సు’లో గొడవ

♦ ఎయిర్‌లైన్స్ సిబ్బందికి ప్రయాణికులకు వాగ్వాదం
♦ ప్రయాణికులను వదిలేసి రాయ్‌పూర్ వెళ్లిన ఇండిగో విమానం
♦ పోలీసుల రంగ ప్రవేశంతో ఇరుపక్షాల మధ్య సయోధ్య
♦ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ప్రయాణికులను పంపిన ఎయిర్‌లైన్స్ సంస్థ
 
 శంషాబాద్: అది ఎయిర్ బస్సు.. కానీ అందులో గొడవ చోటు చేసుకోవడంతో ప్రయాణికులను వదిలేసి ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంది.. పరిస్థితి పోలీసుల దాకా వెళ్లడంతో ఎట్టకేలకు సయోధ్య కుదిర్చారు. బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని ఓ పెళ్లి విందులో పాల్గొనడానికి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 70 మందితో కూడిన బంధువుల బృందం రెండురోజుల క్రితం నగరానికి వచ్చింది. శుక్రవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాయ్‌పూర్ వెళ్లడానికి వీరు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 466వ నంబర్ విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. అందరూ బంధువులే కావడంతో విమానంలో తమకు తోచిన విధంగా సీట్లలో కూర్చున్నారు.

కానీ, టికెట్ బుకింగ్ ఆధారంగానే సీట్లలో కూర్చోవాలని ఎయిర్‌లైన్స్ సిబ్బంది వారికి సూచిం చారు. అందుకా బృందం అంగీకరించలేదు.  ఈ విషయమై పెళ్లి బృందానికి, ఎయిర్‌లైన్స్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో రాత్రి 9 గంటలకు ప్రయాణికులను అక్కడే దించేసి విమానం టేకాఫ్ తీసుకుంది. ఈ నేపథ్యంలో పెళ్లి బృందం ఎయిర్‌లైన్స్ సిబ్బందితో గొడవకు దిగి.. అర్ధరాత్రి వరకు విమానాశ్రయంలో ఆందోళన చేపట్టింది. చివరకు ఆర్‌జీఐఏ పోలీసులు వచ్చి ప్రయాణికులకు, ఎయిర్ లైన్స్ సిబ్బందికి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో పెళ్లి బృందాన్ని శంషాబాద్‌లోని ఓ హోటల్‌లో బస చేయించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ శనివారం ఉదయం కొందరు ప్రయాణికులను, సాయంత్రం మరికొందరిని రాయ్‌పూర్‌కు వేర్వేరు విమానాల్లో పంపారు.

మరిన్ని వార్తలు