పేదల ‘దీపం’కు మోక్షం !

13 Sep, 2015 23:55 IST|Sakshi

తొలి విడతకు ఐదు వేల కనెక్షన్లు
కొనసాగుతున్న లబ్ధిదారులు ఎంపిక
డిసెంబర్‌లోగా కనెక్షన్ల పంపిణీ పూర్తిడ

 
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని పేదింటి మహిళలకు ‘దీపం’ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. తొలి విడతగా నియోజకవర్గానికో ఐదు వేల దీపం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జీహెచ్‌ఎసీ పౌరసరఫరాల శాఖ అధికారులు లబ్ధిదారులకు ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తిచేసి ఈ ఏడాది చివరి నాటికి అర్హులకు కనెక్షన్లు జారీ చేసే విధంగా చర్యలు చేపట్టారు. అర్హులైన నిరుపేద మహిళలకు దీపం పథకం కింద కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఫిబ్రవరి నెలలోనే మార్గదర్శకాలు విడుదల చేసింది. రాజకీయ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో మార్గదర్శకాల్లో కొద్దిపాటి మార్పులు చేసి ఇన్‌చార్జి మంత్రులకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను కట్టబెడుతూ సరిగ్గా రెండు మాసాల క్రితం మరో ఉత్తర్వు ఇచ్చింది. అప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలతో పాటు అర్బన్ ఐకేపీ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ కార్యాలయం (సీఆర్వో), రంగారెడ్డి పౌరసరఫరాల శాఖ కేవలం కనెక్షన్ల మంజూరు, గ్యాస్ ఏజెన్సీల ఎంపిక బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

నిబంధనల ప్రకారం ప్రతి సర్కిల్‌లోనూ స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో వార్డు కమిటీ సమావేశాల్లో లబ్ధిదారులను ఎంపిక నిర్వహించాలి, కానీ ప్రస్తుతం కార్పొరేటర్లు మాజీలయ్యారు. దీంతో నియోజకవర్గ ఎమ్మెల్యే సమక్షంలో డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపికను పౌర సరఫరాల అధికారులు కసరత్తు ప్రారంభించారు.

 ఉచితంగా కనెక్షన్లు
 జీహెచ్‌ఎంసీ పరిధిలోని నిరుపేద కుటుంబాల్లో దీపం పథకం కనెక్షన్లు వెలుగు నింపనున్నాయి. వాస్తవంగా పథకం కింద ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ రూ.1600 లను ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటికే మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కనెక్షన్లకు సంబంధించి నిధులను సైతం విడుదల చేసింది. సిలిండర్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ రూ.1450, కాగా, రెగ్యులేటర్ కోసం రూ.150లు. దీపం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు జారీ చేసి ఖాళీ సిలిండర్, రెగ్యులేటర్ అందజేస్తారు. లబ్ధిదారులు కనెక్షన్ డాక్యుమెంట్, పాస్‌బుక్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఐఎస్‌ఐ మార్క్ గల గ్యాస్ స్టౌవ్, పైపు, గ్యాస్(నిండిన) మాత్రమే కోనుగోలు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుడు దీపం కనెక్షన్‌తో పాటు డీలరు వద్ద తప్పనిసరిగా గ్యాస్ స్టౌవ్‌ను కొనుగోలు చేయాల్సి అవసరం లేదు. చమురు సంస్థలు కూడా కనెక్షన్లకు సిద్ధమయ్యాయి.
 
 

మరిన్ని వార్తలు