కరో.. కరో.. జర జల్సా

21 Nov, 2014 23:31 IST|Sakshi
కరో.. కరో.. జర జల్సా

విలాసాల కోసం యువత పెడదారి
దొంగతనాలు, నేరాల బాట
పోలీసుల విచారణలో వెల్లడి
నిందితులలో ఉద్యోగులు, విద్యావంతులు

 
విలాసాలు... జల్సాలకు అలవాటు పడడం...  విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం... కార్లు... విందు వినోదాలు... పబ్‌లు...ఇవన్నీ నగరంలోని యువతను అడ్డదార్లు తొక్కిస్తున్నాయి.  ఉన్నత విద్యావంతులు... బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్న వారు సైతం పెడదారి పడుతున్నారు. రాత్రికి రాత్రే ధనవంతులం కావాలనే అత్యాశతో దొంగతనాలు... కిడ్నాప్‌లు... మర్డర్ల వంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. కష్టపడి సంపాదించే కంటే... అడ్డదారిలో ముందుకు వెళ్లాలనే దురాశతో నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు. గ్రేటర్‌లో ఇటీవల చోటుచేసుకున్న దొంగతనాలు...ఇతర నేరాల్లో పోలీసులకు చిక్కుతున్న నిందితుల్లో అధికశాతం ఈ తరహా వారేనని వెల్లడైంది.  మద్యం... అమ్మాయిలను ఆకర్షించడం వంటిప్రయత్నాలు చేసే క్రమంలో వారు నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నగరంలో గత మూడు రోజుల్లో చోటు చేసుకున్న సంఘటనలూ ఈ కోవలోకే వస్తున్నాయి. తాగుడు....
 రాసలీలలకు బానిసైన కానిస్టేబుల్ ఓబులేసు ఏకంగా ఏకే-47 చోరీ చేసి...నేరాల బాట పట్టాడు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన కె.విశ్వనాథ్(25) కూడా ఉన్నత విద్యావంతుడే. జల్సాలకు అలవాటు పడి... డబ్బు కోసం తుపాకీతోజనాలను బెదిరిస్తూ పోలీసులకు చిక్కాడు. అనంతపురం జిల్లాకు చెందిన దేవరాజ్ (28) బీటెక్ పూర్తి చేశాడు. ఆ యువకుడూ విలాసాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ సంఘటనలు నగరంలో పెరుగుతున్న విష సంస్కృతికి అద్దం పడుతున్నాయి.  
 
క్రమశిక్షణ, అంకితభావానికి నిదర్శనంగా నిలిచే ఏపీఎస్పీ బెటాలియన్‌లో శిక్షణ పొందిన ఓబులేసు జల్సాల బాట పట్టి నేరప్రవృత్తికి అలవాటు పడ్డాడు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలన్న దురాశ... నేరాల వల్ల వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం ప్రవృత్తిగా మారడమే అతన్ని కిడ్నాప్ యత్నానికి పురిగొల్పిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. చిన్నవయసులోనే కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. వేతనాన్ని విలాసాలకు ఖర్చు చేయడమేకాక.. తల్లిదండ్రులకు తన కష్టార్జితంలో నయాపైసా విదల్చకపోవడం గమనార్హం. అవివాహితుడైన ఓబులేసు అడ్డదారుల్లో సంపాదించిన మొత్తాన్ని రాసలీలలకే ఖర్చు చేసేవాడంటే... ఎంత జల్సారాయుడో అర్థం చేసుకోవచ్చు. గతంలో కిడ్నాప్ యత్నానికి పాల్పడి రూ.లక్షల్లో దండుకొని... కేవలం పబ్‌లు, విందు, వినోదాలు, విలాసాలకే ఖర్చు చేయడం గమనార్హం. విలాసాల బాట పట్టి కటకటాలపాలైన ఈ కానిస్టేబుల్ ఉదంతం పోలీసు అధికారులను నివ్వెరపరిచింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని పబ్‌లకు వెళ్లేవాడని తెలిసింది. ఒక్కసారి పబ్బుకు వెళ్తే కనీసం రూ.20 నుంచి రూ.30 వేలు ఖర్చు పెట్టేవాడని సమాచారం. అమ్మాయిలతో రాసలీలకే ఎక్కువ మొత్తం వెచ్చించేవాడు. నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపి పారిపోయి... కర్నూలులోని లాడ్జిలో పట్టుబడే సమయంలోనూ అమ్మాయిలతో ఉన్నట్టు తెలిసింది.

సెలవులో ఉన్నాడంటే అంతే...

జల్సాలైనా... నేరాలైనా సెలవు రోజుల్లోనే చేయడం ఓబులేసు హాబీ, గత ఏడాది డిసెంబర్‌లో గండిపేటలోని గ్రేహౌండ్స్ విభాగం నుంచి ఏకే-47 చోరీ చేసింది తాను సెలవులో ఉన్న సమయంలోనే. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనవడిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు దోచుకున్నప్పుడూ సెలవులోనే ఉన్నాడు. ఇకనిత్యానంద రెడ్డి కిడ్నాప్ యత్నం, కాల్పులకు బరి తెగించింది కూడా తాను సెలవులో ఉన్న రోజే. చివరికి అరెస్టయిందీ సెలవులో ఉన్నప్పుడే.

తలకు విగ్‌తో..

నేరానికి పాల్పడే సమయంలో ఓబులేసు తలకు విగ్ వాడేవాడు. కేబీఆర్ పార్కు వద్ద కాల్పుల సంఘటన స్థలంలో  విగ్ లభించింది. నిత్యానందరెడ్డి, ప్రసాద్‌రెడ్డిలు ఓబులేసును ప్రతిఘటించే క్రమంలో అతని తలకు ఉన్న విగ్ ఊడి కింద పడింది. దీన్ని  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే విగ్ వాడుతున్నట్లు విచారణలో ఓబులేసు అంగీకరించాడు.
 
తుపాకీతో బెదిరిస్తూ...
 
దత్తాత్రేయనగర్: తుపాకితో సంచరిస్తున్న ఓ విద్యార్థిని టప్పాచబుత్ర పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ బి. రవీందర్ వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన కె. విశ్వనాథ్(25) ఎంబీఏ విద్యార్థి. జల్సాలకు అలవాటు పడిన విశ్వనాథ్ కొంత మంది బీహారీలతో కలిసి 3 నెలల క్రితం బీహార్‌కు వెళ్లాడు. అక్కడ సింగిల్ బ్యారెల్ తుపాకి, 6 బుల్లెట్లను కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చాడు. అప్పటి నుంచి ఏకాంతంగా ఎవరైనా కనిపిస్తే బెదిరించి డబ్బులు, వారి వద్ద ఉన్న సొత్తును దోచుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుడిమల్కాపూర్ వెనకాల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో విశ్వనాథ్ అటుగా వెళ్తున్నాడు. ఆయన ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా తుపాకి, 6 బుల్లెట్లు బయటపడ్డాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు