కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి కన్నుమూత

22 Dec, 2014 20:48 IST|Sakshi
జి.వెంకటస్వామి

హైదరాబాద్:  కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి(85) కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 8.40 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.   1929 అక్టోబరు 5న ఆయన సికింద్రాబాద్లో జన్మించారు. 1957, 1978లలో ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు.

1967లో తొలిసారిగా పెద్దపల్లి నుంచి ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన 7 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. పలుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు మంత్రి వర్గంలో ఆయన పని చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కొడుకులూ రాజకీయాలలోనే ఉన్నారు. మాజీ మంత్రి శంకర రావు ఆయన పెద్ద అల్లుడు.

1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ముషీరాబాద్ జైలు వద్ద జరిగిన కాల్పుల్లో వెంకటస్వామి గాయపడ్డారు. నేషనల్ హట్స్ సొసైటీ కింద వేల మంది పేదలకు ఆయన గుడిసెలు నిర్మించారు. అప్పటి నుంచి ఆయనను గుడిసెల వెంకటస్వామిగా పిలుస్తారు. కాకా స్థాపించిన విద్యాసంస్థను ఒక్క రూపాయి డొనేషన్  తీసుకోకుండా నిర్వహిస్తున్నారు.

వెంకటస్వామి ఎన్నికైన, చేపట్టిన పదవులు:
    1957- 62, 1978-84 శాసనసభ సభ్యుడు
    1967 లో 4వ లోకసభకు పెద్దపల్లి నుంచి ఎన్నికయ్యారు.
    1969 - 71 పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
    1971 లో  5వ లోకసభకు  ఎన్నికయ్యారు.
    1973  - 1977  - కేంద్ర మంత్రి
      1977 లో 6వ లోకసభకు ఎన్నికయ్యారు.
    1978 - 1982 రాష్ట్ర మంత్రి
    1982 - 1984 పిసిసి అధ్యక్షుడు
    1989 లో 9వ లోకసభకు ఎన్నికయ్యారు.
    1991 లో  10వ లోకసభకు ఎన్నికయ్యారు.
    1991-1996 కేంద్ర మంత్రి
    1996 లో  11వ లోకసభకు ఎన్నికయ్యారు.
    2002-2004 ఏఐసీసీ ఎస్సీ అండ్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు.
    2004 లో 14వ లోకసభకు ఎన్నికయ్యారు.
ఇంకా కేంద్రంలో అనేక కమిటీలలో సభ్యుడుగా ఉన్నారు.
 

మరిన్ని వార్తలు