భారత్‌కు ఉగ్రవాది గిడ్డా అజీజ్

19 Jan, 2016 07:49 IST|Sakshi
భారత్‌కు ఉగ్రవాది గిడ్డా అజీజ్

ఎట్టకేలకు డిపోర్టేషన్‌పై...  నగరంలో నమోదైన కేసుల్లో మోస్ట్ వాంటెడ్
బోస్నియా అంతర్యుద్ధంలో కీలకపాత్ర
నకిలీ పాస్‌పోర్ట్ కేసులో తొమ్మిదేళ్ల క్రితం సౌదీలో అరెస్టు
శిక్షాకాలం పూర్తికావడంతో తిప్పి పంపిన అధికారులు

 
సిటీబ్యూరో: నగరానికి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ భారత్‌కు వస్తున్నాడు. సౌదీ అరేబియాలో తలదాచుకుని, అక్కడ నుంచే ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తూ వచ్చాడు. పుష్కరకాలంగా పోలీసు, నిఘా వర్గాలు వేటాడుతున్న ఇతగాడిని తొమ్మిదేళ్ల క్రితం నకిలీ పాస్‌పోర్ట్ కేసులో సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులో శిక్ష పూర్తి చేసుకున్న అజీజ్‌ను డిపోర్టేషన్‌పై బలవంతంగా తిప్పి పంపిస్తున్నట్లు హైదరాబాద్ అధికారులకు ఆదివారం సౌదీ నుంచి సమాచారం అందింది. సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో విమానాశ్రయం లో అజీజ్ విమానం దిగుతున్నట్లు తెలిసి నగరం నుంచి నిఘా విభాగం అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఇతడిని మంగళ-బుధవారాల్లో సిటీకి తరలించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
 
ఫసీ మాడ్యుల్ ద్వారా ఉగ్రబాట...
భవానీనగర్‌కు చెందిన అబ్దుల్ అజీజ్ 1985 నుంచి 87 వర కు పాతబస్తీలోని మదీనా ప్రాంతంలో ఉన్న ఓ పెట్రోల్ పంప్‌లో మేనేజర్‌గా పని చేశాడు. నల్గొండ జిల్లా బోనాల్‌పల్లికి చెందిన నిషిద్ధ స్టూడెం ట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాది మహ్మద్ ఫసీయుద్దీన్ అలి యాస్ ఫసీ ద్వారా ఉగ్రవాద బాటపట్టాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు (ఎల్‌ఈటీ) అనుబంధంగా ఆజం ఘోరీ ఏర్పాటు చేసిన ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్ (ఐఎంఎంఎం)తో సంబంధాలు ఏర్పాటు చేసుకుని సన్నిహితంగా మెలిగాడు. హత్యలు, దోపిడీలతో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఫసీ అతని అనుచరుడు మీర్ 1993 జూన్ 21న కార్ఖానా పరిధిలో జరి గిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. 2000లో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆజం ఘోరీ చని పోయాడు. దీంతో సౌదీ అరేబియాకు వెళ్లిపోయిన గిడ్డా అజీజ్ అక్కడే ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రిలీఫ్ ఆర్గనైజేషన్ (ఐఐఆర్వో) అనే సంస్థలో చేరాడు. పూర్తి స్థాయి జిహాదీ వాలంటీర్లతో కూడిన ఈ సంస్థలో అజీజ్ కీలకపాత్ర పోషించాడు. ఆ సంస్థకు చెందిన షేక్ అహ్మద్ అనే వ్యక్తి ద్వారా రూ.9.5 లక్షలు అందుకున్న అజీజ్ ఆ డబ్బు వెచ్చించి నగరానికి చెందిన యువతనూ ఉగ్రవాదం వైపు ఆకర్షించడంతో పాటు పేలుడు పదార్థాల సమీకరణకు పురిగొల్పాడు. ‘బాబ్రీ’ ఉదంతం తరవాత రెచ్చిపోయిన అజీజ్ అయోధ్యతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ స్థాయిలో విధ్వంసానికి కుట్రపన్నాడు.

రెండు దేశాలు... మూడు పాస్‌పోర్టులు...
బోస్నియా-చెచెన్యాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఆకర్షితుడైన అజీజ్ 1995లోనే ఆ దేశానికి వెళ్లొచ్చాడు. ఆ యుద్ధా ల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది యువతకు ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చాడు. 1995 జూలై 17 బోస్ని యా నుంచి అసలు పేరుతోనే పాస్‌పోర్ట్ పొందాడు. ఆపై భారత్‌కు వచ్చిన గిడ్డా అజీజ్ 1993 జనవరి 7న సికింద్రాబాద్ ఆర్పీఓ కార్యాలయం నుంచి తన పేరుతోనే మరో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. 2000 అక్టోబర్ 3న అబ్దుల్ కరీం పేరు తో ఇంకో నకిలీ పాస్‌పోర్ట్ పొందాడు. అజీజ్ సహా అతడి అనుచరుల్ని నగర పోలీసులు 2001 ఆగస్టు 28న అరెస్టు చేశారు. విధ్వంసాలకు కుట్ర పన్నిన ఆరోపణలపై అభియోగాలు మోపారు. అరెస్టు సమయంలో పోలీసులు నకిలీ పాస్‌పోర్ట్‌తో పాటు బెల్జియం తయారీ తుపాకీ, పేలుడు పదార్థాలు, రెచ్చగొట్టే సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అజీజ్ సౌదీ అరేబియాకు పారిపోయాడు.

గణేశ్ ఆలయం పేల్చివేతకు కుట్ర...
మూడేళ్ల పాటు సౌదీలోనే ఉన్న అజీజ్ 2004లో హైదరాబాద్ వచ్చాడు. నగరానికి చెందిన మరికొం దరితో కలిసి సికింద్రాబాద్‌లో ఉన్న గణేశ్ ఆలయం పేల్చివేతకు కుట్రపన్నాడు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పేలుళ్లకు పన్నిన ఈ కుట్రను ఛేదించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మిగిలిన నింది తుల్ని అరెస్టు చేయగా... గిడ్డా అజీజ్ త్రుటిలో తప్పించుకున్నాడు. బోస్నియా పాస్‌పోర్ట్ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్‌ది నకిలీ పాస్‌పోర్ట్ అని గుర్తిం చిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశా రు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అజీజ్‌పై 2008లో ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్‌పోర్ట్ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు భారత్‌కు డిపోర్ట్ చేశారు.
 
కానిస్టేబుల్ కుమారుడు...
 అజీజ్ తండ్రి మెహతబ్ అలీ పోలీసు కానిస్టేబుల్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. నగర సాయుధ విభాగంగా పిలిచే సీఏఆర్ హెడ్-క్వార్టర్స్‌లో హెడ్-కానిస్టేబుల్‌గా పని చేసిన అలీ ప్రస్తుతం నగర శివార్లలోని షహీన్‌నగర్‌లో స్థిరపడ్డారు. గిడ్డా సోదరుడు అబ్దుల్ రషీద్ అదే ప్రాంతంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు.
 

మరిన్ని వార్తలు