ఎస్సీ ఉప కులాల ఉన్నతికి తోడ్పడాలి

22 Sep, 2014 00:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల ఫలాలు సరిగా అందక అభివృద్ధి విషయంలో వెనుకబడిన షెడ్యూల్ కులాల్లోని ఉప కులాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలను ఇవ్వాలని రాష్ర్ట షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సూచించింది. షెడ్యూల్ కులాల్లో సమస్థాయిని సాధించేందుకు అల్పసంఖ్యాక, నిర్లక్ష్యానికి గురవుతున్న ఉప కులాలకు ఈ ప్యాకేజీలను అందించాలని సిఫార్సు చేసింది.

షెడ్యూల్ కులాల సబ్‌ప్లాన్ కింద వచ్చే నిధులను ఎస్సీ జనాభా అనుగుణంగా నేరుగా ఎస్సీ అభివృద్ధి శాఖకే కేటాయిస్తే ఆయా పథకాల ద్వారా వ్యక్తిగతంగా ఎస్సీ కుటుంబాలకు, ఆయా జనావాసాలకు (హాబిటేషన్) నేరుగా అందించడంతో పాటు, ప్రణాళికలను రూపొందించుకునేందుకు అవకాశం ఉం టుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన సిఫార్సులు, సూచనలు,సలహాలతో రాష్ట్ర ప్రభుత్వానికి  షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఒక నివేదికను సమర్పించింది. సంక్షేమరంగానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీకి కూడా ఈ శాఖ అధికారులు పలు సూచనలు, శాఖ పనితీరును మెరుగుపరిచేందు కు సలహాలను లిఖితపూర్వకంగా అందజేశారు.
 
ఎస్సీల అత్యాచారాల విచారణకు జిల్లాకో పోలీస్‌స్టేషన్...
ఎస్సీలపై అత్యాచారాలు, దాడులకు సంబంధించిన కేసుల కోసం జిల్లాకు ఒక పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని, బాధితులకు సహాయసహకారాలు అందించేందుకు లీగల్‌సెల్‌ను ఏర్పాటుచేయాలని సూచించింది. ట్రెజరీ కంట్రోల్ లేకుండా అత్యాచారాలు, దాడులకు గురైన బాధితులకు నగదు, న్యాయపరమైన సహాయం అందించేలా ప్రస్తుతం ఉన్న నిబంధనలను సడలించాలని విజ్ఞప్తి చేసింది. ఎస్సీ యువత, విద్యార్థుల కోసం జిల్లాకు ఒక స్టడీ సర్కిల్‌ను, ఎస్సీ సబ్‌ప్లాన్ అమలును పర్యవేక్షించేందుకు శాఖాధిపతి కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. కమ్యూనిటీ హాళ్లను నాలెడ్జ్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని తన నివేదికలో పేర్కొంది.
 
ఈ శాఖ సిఫార్సుల్లో ముఖ్యమైనవి..
మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంలో భాగంగా అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో టాయ్‌లెట్లు, బాత్‌రూమ్‌లు, నిరంతరాయ నీటి సదుపాయం కల్పించాలి.
హాస్టళ్లలో ఉంటున్న వారికి కాస్మోటిక్ చార్జీలను పెంచాలి
హాస్టళ్ల నిర్వహణకు నిధుల కేటాయింపు
సమీకృత సంక్షేమ వసతి గృహాల కాంప్లెక్స్‌లను దశలవారీగా నిర్మించాలి
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఇంకా అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ (డెరైక్ట్ రిక్రూట్‌మెంట్) పోస్టులు భర్తీచేయాలి
అన్ని కాలేజీ హాస్టళ్లకు నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టుల (ఔట్ సోర్సింగ్ అనుమతితో) మంజూరు చేయాలి.

మరిన్ని వార్తలు