ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం: రావుల

9 Jul, 2016 04:34 IST|Sakshi
ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం: రావుల

సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు సరోజినీదేవి ఆసుపత్రికి వెళితే చూపు వస్తుందనే పరిస్థితి నుంచి అక్కడికి వెళ్లాలంటేనే  రోగులు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న కంటితుడుపు వ్యవహారాల వల్లే ఇంత మంది చూపు పోయిందన్నారు.

ఈ ఘటనలో వైద్యులు, సిబ్బంది, పాలకవర్గం, ఫార్మసీ విభాగాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టివేయడానికి ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. చూపు కోల్పోయిన బాధితులకు పరిహారం, జీవనాధారం, వారి సహాయకులకు చేదోడు కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని అటకెక్కించి కార్పొరేట్ వైద్యం వైపు మళ్లిస్తున్నార నే ఆరోపణలకు ఇది బలం చేకూర్చుతుందని  పేర్కొన్నారు. ఆపరేషన్లు వికటించిన ఘటనపై ఉన్నత స్థాయి వైద్య నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు.

>
మరిన్ని వార్తలు