గ్రేట్ ముహూర్తం

13 Aug, 2014 04:00 IST|Sakshi
గ్రేట్ ముహూర్తం

బలమైన లగ్నాలు కుదిరాయి.. తిథులు, నక్షత్రాలు కలిశాయి.. వారాలు కలిసొచ్చాయి.. వివాహఘడియలకు శుభసూచకంగా మారాయి.. వీటికి తోడు శ్రావణ మాసం.. ఇలాంటి తరుణంలో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి.. వరుసగా మూడు రోజులు వివాహాలకు అనువుగా ఉండడంతో గ్రేటర్‌కు పెళ్లిక ళ వచ్చేసింది. మండపాలు, ఫంక్షన్ హాళ్లు, గృహాలు అందంగా ముస్తాబవుతున్నాయి. మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి.
 
- మూడు రోజులూ సందడే
- వేల సంఖ్యలో వివాహాలు
- ముస్తాబవుతున్న ఫంక్షన్‌హాళ్లు, మండపాలు
- భారీగా పెరిగిన ధరలు
- రెట్టింపైన పెళ్లి బడ్జెట్

సాక్షి, సిటీబ్యూరో/కంటోన్మెంట్, చంపాపేట్, హస్తినాపురం, నాగోల్: శ్రావణమాసం.. పెళ్లిళ్లకు అనుకూలం.. అందునా మంచి ముహూర్తాలు కలిసొస్తే ఇక పెళ్లి సందడే. బుధ, గురు, శుక్రవారాలు ఉన్నతమైన గ్రహస్థితి, చక్కటి తిథులు, వేళలు అన్నీ శుభసూచికంగా మారాయి. ఈ అద్భుత ఘడియల్లో వేలాది జంటలను ఒక్కటి చేసేందుకు మండపాలు, ఫంక్షన్‌హాళ్లు అందంగా ముస్తాబవుతున్నాయి. నగరంలో ఏ గల్లీ చూసినా పెళ్లి సందడే. వస్త్ర, బంగారు దుకాణాలు రద్దీగా ఉన్నాయి. భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతున్న సందర్భంగా ఫంక్షన్ హాళ్లకు భారీ డిమాండ్ నెలకొంది.
 
ధరలకు రెక్కలు...
ఈ శ్రావణ మాసం అన్నీ మంచి రోజులే. అయితే ఈ నెల 13, 14, 15 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో అన్ని రకాల వస్తువుల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు ధరలు అమాంతం పెంచేశారు. మండపాలను అలంకరించే ఆర్టిస్టులు మొదలుకొని సన్నాయి వాద్యకారులు, పురోహితులు, కేటరింగ్ వాళ్లు అందరికీ డిమాండ్  పెరిగింది. కిందటే డాది కంటే ఈసారి చార్జీలు భారీగా పెంచేశారు. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల వ్యయం అయ్యే పెళ్లి బడ్జెట్ ఏకంగా రూ. 10 లక్షలకు చేరుకోనుంది.
 
సికింద్రాబాద్, కంటోన్మెంట్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో సాధారణ రోజుల్లో రూ. 2 లక్షలు మాత్రమే ఉండే ఓ ఫంక్షన్ హాలు అద్దె రూ. 3 లక్షలకు పెంచేశారు. ఎల్‌బీనగర్, చంపాపేట్, నాగోల్, సాగర్ రింగురోడ్డు తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లు సాధారణ రోజుల్లో రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలుండగా ప్రస్తుతం రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెరిగాయి. ఫంక్షన్ హాళ్లు లభించని వారు బస్తీల్లోని కమ్యూనిటీ హాళ్లు, ఇంటి ముందు సెట్టింగులతో ఉన్నంతలో ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 
‘డెకరేషన్’ ఎక్కువైంది!

పెళ్లి మండపాలు, ఆహ్వాన వేదిక, సెట్టింగుల ఖర్చులు భారీగా పెరిగాయి. రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఇందుకోసమే ఖర్చుచేస్తున్నారు. డెకరేషన్లకు జర్‌బరా, కార్నేషన్, ఆర్కిడ్, ఆంథోరియమ్ వంటి పూలను వాడుతారు. సాధారణ రోజుల్లో జర్‌బరా బంచ్ (పది పూల కట్ట)కు సగటున రూ. 50 ఉంటే ప్రస్తుతం అది రూ. 200 లకు పెరిగింది. కార్నేషన్ ధరలు రూ. 150 నుంచి రూ. 300 వరకు, ఆర్కిడ్ రేట్లు రూ. 200 నుంచి రూ. 400కు పెరిగాయి.
- సాధారణ రోజుల్లో  రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు తీసుకునే వీడియోగ్రాఫర్లు ప్రస్తుతం రూ. 2 లక్షలకు పైగా డిమాండ్ చేస్తున్నారు.
- ఒకే సమయంలో ఎక్కువ ముహూర్తాలు రావడంతో పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వేద పాఠశాలల్లో ఉండే పండితులు, దేవాలయ అర్చకులు సైతం  రంగంలోకి దిగారు.
- నాదస్వర విద్యాంసులకు సైతం డిమాండ్ నెలకొంది. సాధారణంగా ఒక పెళ్లికి రూ. 15,000 నుంచి రూ. 25,000 తీసుకునే ఐదుగురు సభ్యుల బృందం ప్రస్తుతం రూ. 30,000కు పైగా డిమాండ్ చేస్తున్నారు.
 
మూసుకున్న హాళ్లూ తెరుచుకుంటున్నాయ్!
కంటోన్మెంట్‌లో బీ-3 కేటగిరీకి చెందిన ఓల్డ్ గ్రాంట్ బంగళా స్థలాల్లో  ఉన్న ఫంక్షన్ హాళ్లను గతేడాది బోర్డు అధికారులు మూసేయగా, మరికొందరు నిర్వహణ భారం మోయలేక మరికొందరు హాళ్లను మూసేశారు. మల్కాజ్‌గిరిలోని మల్లారెడ్డి గార్డెన్‌ను ఎనిమిది నెలల కిందట మూసేశారు. ప్రస్తుతం షెడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పెళ్లిళ్లకు సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు