దసరోత్సాహం! ఈ పండుగవేళ ఇంటిని ఇలా అలకరిస్తే..

23 Oct, 2023 16:51 IST|Sakshi

ఇంటి లోపల అడుగుపెట్టగానే మన దృష్టి ముందుగా హాలు, వంటగదివైపే ఉంటుంది. ఈ మధ్యలో ఉండే స్పేస్‌లో అలంకరణ ప్రత్యేకంగా ఉండాలనుకుంటే అందమైన గంటలను వేలాడదీయవచ్చు. అలాగే, గుమ్మం ముందూ వివిధ మోడల్స్‌లో దొరికే  గంటలు వేలాడదీయవచ్చు. వాటికి నచ్చిన రంగులతో పెయింట్‌ చేయవచ్చు. ఇంటి లోపల మెట్లు ఉంటే ఫెయిరీ లైట్లను, మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రమిదలనూ అమర్చుకోవచ్చు. బొమ్మల కొలువు ఏర్పాటుచేసుకోవచ్చు. 

కర్టెన్స్‌ .. పెయింటింగ్స్‌
గాడీగా కాకుండా సింపుల్‌గా ఉండాలనుకుంటే లివింగ్‌ రూమ్‌లో సంప్రదాయ ప్రింట్స్‌తో ఉన్న కర్టెన్లను ఎంచుకోవాలి. ప్లెయిన్‌గా ఉండే గోడలపై పౌరాణిక పాత్రలున్న పెయింటింగ్స్‌ను అలంకరించుకోవచ్చు. లివింగ్‌ రూమ్‌ ఫ్లోర్‌ డల్‌గా ఉంటే వెంటనే కళాత్మకమైన డిజైన్‌ ఉన్న కార్పెట్‌ను వేసి గది శోభను పెంచొచ్చు. మరింత లుక్‌ రావాలంటే సెంటర్‌ టేబుల్‌ని ఒక సైడ్‌గా ఉంచి.. ప్రమిదలను ఏర్పాటు చేసుకోవచ్చు. 

మండపం అలంకరణ
దేవుడిని పెట్టుకునే మండపానికి డార్క్‌ బ్రౌన్‌ కలర్‌ వేస్తే బాగుంటుంది. అలాగే  పసుపు, గులాబీ, నారింజ రంగుల్లో పూల దండలతో అలంకరించుకోవాలి. మండపం ముందు రంగోలీకి బదులు సంప్రదాయ కార్పెట్‌ను వాడొచ్చు. మధ్యలో రాగి లేదా ఇత్తిడి గిన్నెను నీళ్లతో నింపి పువ్వులతో అలంకరించాలి. పూజగది గుమ్ముం ముందు రెండు ఏనుగు బొమ్మలను ఉంచితే ఇంట్లో ఆలయం కొలువుదీరిన అనుభూతి కలుగుతుంది. 

క్రొషే కళ 
పండగ ప్రత్యేక అలంకరణలో మరో ఆకర్షణీయమైన హంగు క్రోషే డిజైన్‌. ప్లెయిన్‌ గోడలపై క్రోషే వాల్‌ హ్యాంగింగ్స్‌ను వేలాడదీస్తే అద్భుతంగా ఉంటుంది. క్రోషే హ్యాంగింగ్స్‌ వద్దనుకుంటే క్రోషే తోరణాలు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి.  

(చదవండి: థాయిలాండ్‌లో కూడా నవరాత్రులు..రెస్టారెంట్‌, హోటళ్లలో ఓన్లీ వెజ్‌!)

మరిన్ని వార్తలు