ఒక్క కిలోమీటర్... రెండు గంటలు.. నరకం

16 Sep, 2016 20:19 IST|Sakshi
హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం

హైదరాబాద్ :శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని కుదిపేసింది. నగర జీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి రోడ్లన్నీ ఏరులై పారుతున్నాయి. వర్షం కారణంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మణికొండ, మాదాపూర్, ఖైరతాబాద్, కోఠి, నాంపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక ఇళ్లు నీట మునిగాయి. పలు కాలనీల్లో కరెంటు వైర్లు తెగిపడిన కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

ఇళ్లకు చేరుకోవాలనుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వర్షం కాస్తా తెరపినివ్వడంతో ఒక్కసారిగా వాహనాలు రోడ్లపైకి రావడంతో నగరంలో అన్ని చోట్లా విపరీతమైన ట్రాఫిక్ జాంలు ఏర్పడ్డాయి. ఎల్ బీ నగర్ నుంచి మియాపూర్ వరకు రహదారులన్నీ ట్రాఫిక్ తో నిండిపోయింది. కోటీ నుంచి చాదర్ ఘాట్ చేరుకోవడానికి వాహనదారులకు రెండు గంటలు పట్టింది. ఖైరతాబాద్ నుంచి అమీర్ పేట చేరుకోవడానికి అంతే సమయం పట్టింది. రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లలో ఒక్క కిలోమీటర్ ముందుకు వెళ్లడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టడంతో వాహనదారులు గగ్గోలు పెట్టారు.

నగర రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయి ముందుకు కదలలేని పరిస్థితి తలెత్తింది. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. ఆదర్శ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో భారీ వృక్షం కూలడంతో దానికింద మూడు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమీపంలోనీ మిరాలం ట్యాంకులోకి వరద నీరు చేరుతుండటం, సమీపంలోని జూ పార్క్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

సాయంత్రం ఏడు గంటలకు బాలానగర్ లో 68.25 మిల్లీమీటర్లు, కూకట్ పల్లి ప్రాంతంలో 48.5 మిమీ, అమీర్ పేటలో 41.25మిమీ, హిమాయత్ నగర్ లో 25.25 మిమీ వర్షపాతం నమోదైంది. ఈరోజు సాయంత్రం ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ ఇంకా ప్రకటించాల్సి ఉంది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఎండ రావడం, మరోవైపు గణేశ్ నిమజ్జనం సజావుగా పూర్తయి అంతా ఊపిరి తీసుకోగా, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

రెండున్నర గంటల పాటు భారీ వర్షం కురియడంతో పరిస్థితి అతలాకుతలంగా మారింది. ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఎక్కడా పోలీసులు కనిపించడంలేదని వాహనదారులు గగ్గోలు పెట్టారు. గడిచిన రెండు రోజుల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ గుంతలేర్పడగా, తాజా వర్షానికి రోడ్లపై నీటి వరదలోనే వాహనాలు రోడ్లెక్కాయి. వర్షం తగ్గిన గంట తర్వాత కూడా ట్రాఫిక్ జాం పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు.

భారీ వరద రావడంతో మూసీ పొంగి పొర్లుతోంది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. రోడ్లపై నీటిని తోడేయడానికి మున్సిపల్ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్హోల్స్ తెరవవద్దని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కాల్ సెంటర్కు ఫోన్ చేసి సంప్రదించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు.

నమోదైన వర్షపాతం వివరాలు:

బాలనగర్  6.8 సెంటీమీటర్లు
శేరిలింగంపల్లి 4.8
ఆసిఫ్ నగర్ 4.1
అమీర్ పేట 4.1
ఖైరతాబాద్ 4
సికింద్రాబాద్ 2.9
మారేడ్ పల్లి 2.5
హిమాయత్ నగర్ 2.2
కుత్బుల్లాపూర్ 1.9
గోల్కోండ 1.8
తిరుమలగిరి 1.2
అంబర్ పేట 1 సెంటీమీటరు వర్షపాతం

మరిన్ని వార్తలు