ఒకేరోజు 93 మంది ఉద్యోగుల బదిలీ

5 Aug, 2016 03:47 IST|Sakshi

* ‘మైనింగ్’లో భారీగా బదిలీలు
* డీడీ స్థాయి నుంచి టెక్నికల్ అసిస్టెంట్ల వరకు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ గనులు, భూగర్భ వనరుల శాఖలో ఉద్యోగులను పెద్ద ఎత్తున బదిలీ చేశారు. మైనింగ్ విభాగంలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న వివిధ స్థాయిలకు చెందిన 93 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ అయిన ఉద్యోగులు తక్షణమే రిలీవ్ అయి నూతన పోస్టింగుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన వారిలో ఇద్దరు డిప్యూటీ డెరైక్టర్లు, 13 మంది అసిస్టెంట్ డెరైక్టర్లు, 14 మంది అసిస్టెంట్ జియాలజిస్టులు, 30 మంది రాయల్టీ ఇన్‌స్పెక్టర్లు, 34 మంది టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు.

వరంగల్‌లో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న కె.లక్ష్మణ్‌బాబును నిజామాబాద్‌కు, రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న కె.యాదగిరిని వరంగల్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరితో పాటు తాండూరు, మిర్యాలగూడ, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ (విజిలెన్స్), జడ్చర్ల, కొత్తగూడెం, నిజామాబాద్‌లలో పనిచేస్తున్న అసిస్టెంట్ డెరైక్టర్లను బదిలీ చేశారు. ఇటీవల మహబూబ్‌నగర్ అసిస్టెంట్ డెరైక్టర్‌ను సస్పెండ్ చేయగా.. ఆయన స్థానంలో హెడ్ ఆఫీసులో పనిచేస్తున్న జె.అమరేందర్‌రావుకు పోస్టింగు ఇచ్చారు.
 
మైనింగ్‌పై కేటీఆర్ ప్రత్యేక దృష్టి
ఈ ఏడాది ఏప్రిల్ 26న మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్య తలు చేపట్టిన నాటి నుంచి కేటీఆర్.. శాఖ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. 2015-16లో మైనింగ్ ద్వారా రూ.2700 కోట్ల ఆదాయం సమకూరగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4వేల కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. మైనింగ్ అధికారులు, సిబ్బంది పనితీరుపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. అక్రమ మైనింగ్‌ను నివారించడంలో విఫలమైన మహబూబ్‌నగర్ అసిస్టెంట్ డెరైక్టర్, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు.

ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో మైనింగ్ అక్రమాలపై విచారణకు ఆదేశించిన మంత్రి కేటీఆర్.. తాజాగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో అక్రమ మైనింగ్ తీరును స్వయంగా పరిశీలిం చారు. మైనింగ్ విభాగాన్ని గాడిన పెట్టేందుకు.. ఒకే చోట ఏళ్ల తరబడి తిష్టవేసిన వివరాలను సేకరించాల్సిందిగా నెల క్రితం మైనింగ్ విభాగం డెరైక్టర్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం భారీ సంఖ్యలో ఉద్యోగుల బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు