అక్రమ కట్టడాలపై ‘ఆస్తి పన్ను’ పిడుగు

20 Aug, 2016 02:01 IST|Sakshi

* జరిమానాల వసూళ్లకి కొత్త నిబంధనలపై సర్కార్ కసరత్తు
* ఆస్తి పన్నులో 25 నుంచి 100 శాతం జరిమానాలు

సాక్షి, హైదరాబాద్: అక్రమ కట్టడాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, కూల్చివేత జరిగే వరకు ఆ భవనాలపై ఆస్తి పన్నుల రూపంలో భారీ మొత్తంలో జరిమానాలు విధించేవిధంగా కొత్త నిబంధనలను ప్రభుత్వం రూపొందిస్తోంది. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లోని అక్రమ కట్టడాలపై ఈ నిబంధనలను అమల్లోకి తెస్తూ త్వరలో రాష్ట్ర పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా అక్రమ కట్టడాలపై ఆస్తిపన్నులో 25 నుంచి 100 శాతాన్ని జరిమానాగా వసూలు చేయాలని మున్సిపల్ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీలో కొన్ని భవనాలపై ఈ జరిమానాలను వసూలు చేస్తున్నారు. క్రమం తప్పకుండా ప్రభుత్వానికి ఆస్తిపన్నులు, జరిమానాలు చెల్లిస్తున్నందున తమ భవనాల క్రమబద్ధీకరణ జరిగినట్లేనని ఆదేశించాలని కొందరు భవనాల యజమానులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడిగా కేసులు పెండింగ్‌లో ఉండిపోతుండడంతో ఈ భవనాల యజమానుల నుంచి ఆస్తిపన్ను, జరిమానాలను వసూలు చేయలేకపోతున్నారు. ఈక్రమంలో జరిమానా చెల్లించినంత మాత్రాన అక్రమ భవనాల క్రమబద్ధీకరణ జరగదనే విధంగా కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.
 
త్వరలో టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్
అక్రమ కట్టడాలకు సంబంధించిన కేసుల సత్వర విచారణ కోసం టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు నిర్ణయించారు. ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఈ నెల 22న అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు