వంశీ ని ఎలాగైనా చంపి పరువు కాపాడుకోవాలి.. అరుంధతి

24 Dec, 2023 08:00 IST|Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: ప్రేమ వ్యవహరంలో ఈ నెల 18న మావల మండల కేంద్రానికి చెందిన ఎంబడి వంశీపై హత్యాయత్నానికి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్‌ డీఎస్పీ ఉమేందర్‌ అన్నారు. శనివారం మావల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించాడు. మావల గ్రామానికి చెందిన వంశీని హత్య చేసేందుకు కౌన్సిలర్‌ రఘుపతి ఆదిలాబాద్‌ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన చౌహన్‌ రవితో రూ.15లక్షలతో ఒప్పందం చేసుకున్నాడు. రెండేళ్ల కిందట రఘుపతి ఆయన ఫామ్‌హౌస్‌కు వంశీని తీసుకుని వెళ్లి ప్రేమ వ్యవహారానికి దూరంగా ఉండాలని మందలించాడు. అయినప్పటికీ వంశీ, ఆ యువతి తరచుగా మాట్లాడుకోవడం తెలుసుకున్న రఘుపతి ఎలాగైనా వంశీని చంపాలని నిర్ణయించుకున్నాడు.

గతంలో దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చౌహన్‌ రవి, అతడి మిత్రుడు అశోక్‌ ఇద్దరు కలిసి గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత నెల 25న శాంతినగర్‌లో ఎన్నికల ప్రచారంలో రవి రఘుపతిని కలిశాడు. ఆ సమయంలో రఘుపతి ఓ హత్య చేయాలని, రూ.15లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌ కింద రవికి రూ.లక్ష ఇచ్చాడు. గత నెల 28న రవి, అశోక్‌లు దస్నాపూర్‌లోని రఘుపతి ఆఫీస్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఆఫీస్‌ ముందు నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వంశీని చూపించాడు. రఘుపతి భార్య అరుంధతి సైతం వంశీని ఎలాగైనా చంపి పరువును కాపాడాలని కోరింది. అలాగే అశోక్‌కు రూ.5లక్షలు రవికి ఇస్తానని హామీ ఇచ్చాడు. అక్కడి నుంచి వీరిద్దరూ వంశీ ఇంటికి వెళ్లి రెక్కి నిర్వహించారు.

అశోక్‌కు రవి జీపు కావాలని చెప్పగా అశోక్‌ ఆయన స్నేహితుడైన దిల్షాద్‌కు చెప్పాడు. అందుకు జీపు ఓనర్‌కు రూ.20వేలు, మాట్లాడినందుకు దిల్షాద్‌కు రూ.20వేలు ఇస్తానని చెప్పాడు. దిల్షాద్‌ జీపు ఓనర్‌ రాజుతో ఫోన్‌లో మాట్లాడి ఆదిలాబాద్‌ పట్టణంలోని వినాయకచౌక్‌లో కలుసుకున్నారు. జీపుతో ఒకరిని ఢీ కొట్టి హత్య చేయాల్సి ఉందని, అందుకు రూ.20వేలు ఇస్తానని రాజుతో ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 17న రవి, అశోక్‌లు దిల్షాద్‌ను కలిసి జీపు తీసుకురావాలని చెప్పాడు. వంశీ ఈ నెల 18న తెల్లవారు జామున 5గంటల ప్రాంతంలో మణిపూర్‌ కాలనీలో డెయిరీఫాంకు వెళ్తుండగా అశోక్‌ జీపుతో ఢీకొట్టాడు.

ఆ సమయంలో రవి జీపు వెనుకాలో కూర్చున్నాడు. ఈ ప్రమాదంలో వంశీ కిందపడిపోగా మళ్లీ జీపును రివర్స్‌ తీసుకుని ముందుకు వెళ్లే క్రమంలో విద్యుత్‌ స్తంభానికి ఢీకొట్టగా స్తంభం విరిగి ద్విచక్ర వాహనంపై పడడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో వంశీ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో బాధ్యులైన కేఆర్కే కాలనీకి చెందిన చౌహన్‌ రవి, జి.అశోక్‌, ఆదిలాబాద్‌ పట్టణంలోని అబ్దుల్లా చౌక్‌, ఖానాపూర్‌కు చెందిన షేక్‌ దిల్షాద్‌, జైనథ్‌ మండలం మేడిగూడ గ్రామానికి చెందిన రాజులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

వారి వద్ద నుంచి రూ.18,500 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. కౌన్సిలర్‌ ఉష్కం రఘుపతి, ఆయన భార్య అరుంధతిలు పరారీలో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన ఆదిలాబాద్‌ రూరల్‌, జైనథ్‌, సీసీఎస్‌ సీఐలు సైదారావు, నరేష్‌, సాయినాథ్‌, మావల ఎస్సై విష్ణు వర్ధన్‌, ఐడి పార్టీ రమణయ్య, కరీం, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్‌ రూరల్‌ సీఐ సైదారావు, సీసీఎస్‌ సీఐ సాయినాథ్‌, ఎస్సై విష్ణు వర్ధన్‌లు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు