భారీ వర్షం

16 Jul, 2015 00:03 IST|Sakshi
భారీ వర్షం

హయత్‌నగర్‌లో అత్యధికంగా 10 సెంటీమీటర్లు
 గ్రేటర్ పరిధిలో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం
క్యుములోనింబస్ మేఘాల తీవ్రతే కారణం

 
సిటీబ్యూరో: గ్రేటర్ నగరం భారీ వర్షంతో తడిసి ముద్దయింది. మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాలు సహా, రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం తెల్లవారు ఝాము వరకు కుండపోత వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం శివారు ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తన ప్రభావం మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. క్యుములో నింబస్ మేఘాల ఉద్ధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.

మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం తెల్లవారు ఝాము వరకు అత్యధికంగా హయత్‌నగర్ మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో 3.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వికారాబాద్‌లో 8.4, గోల్కొండలో 3.5, మేడ్చల్‌లో 2.5, శామీర్‌పేట్‌లో 1.7 సెంటీమీటర్లు, మహేశ్వరంలో ఒక సెంటీమీటరు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూలై 15 నాటికి హైదరాబాద్ నగరంలో సాధారణంగా 182.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 155.6 మిల్లీమీటర్లు(-15 ఎంఎం) వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 192.3 మిల్లీమీటర్లకుగాను ఇప్పటివరకు 136.6 మిల్లీమీటర్లు (-29 ఎంఎం) వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
 

మరిన్ని వార్తలు