ఈ నాయకులంతా ఏమయ్యారు

11 Apr, 2016 08:49 IST|Sakshi
ఈ నాయకులంతా ఏమయ్యారు

హైదరాబాద్: రెండేళ్ల కిందట ఈ నాయకులు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. విభజనకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో నానా హడావిడి చేసిన కొందరు నాయకులు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయాల నుంచి దాదాపుగా కనుమరుగయ్యారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినప్పటికీ అప్పట్లో హడావిడి చేసిన నేతలెవరూ ఇప్పుడు బయట కనిపించడం లేదు. ఒకవైపు విభజన ఉద్యమం మరోవైపు సమైక్య ఉద్యమం నడుస్తున్న కాలంలో రాష్ట్రం ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోదని చెబుతూ తెగ హడావిడి చేసిన నేతలు చేసేదేమీ లేక గడిచిన రెండేళ్లుగా తమ ఇళ్లకే పరిమితమయ్యారు.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి.. ఇలా ఒక్కొక్కరుగా ఎంతో మంది నేతలు రాష్ట్ర విభజనకు ముందు ఎంతో హడావిడి చేశారు. విభజన జరగదని ఆనాడు గంటాపథంగా చెప్పారు. సాధారణ ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన చట్టం చేయడం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పాటు కావడం జరిగిపోయాయి. ఈ నాయకులు కూడా సైలెంట్ అయిపోయారు.

రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోదని చెబుతూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఆ పార్టీని ఎన్నికల రంగంలో నిలిపారు. జర్మనీ నుంచి ఆయన మిత్రుడొకరు తెచ్చిన రాయిని చూపించి విడిపోయినా మళ్లీ రెండు రాష్ట్రాలు కలుస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత అంతే... ఆయనెక్కడా కనిపించలేదు. తన సన్నిహితులకు చెందిన ఒకరిద్దరు నిర్వహించిన శుభకార్యాలకు హాజరు కావడం మినహాయిస్తే రాజకీయంగా ఆయన పూర్తిగా తెరమరుగైపోయారు. ఆయన బీజేపీలో చేరనున్నారని ఆ మధ్యన వార్తలొచ్చాయి. కానీ అదీ జరగలేదు. ఆయన నియోజకవర్గానికి కూడా వెళ్లిన దాఖలాలు లేవు. తానూ హైదరబాదీనే అని చెప్పుకున్న కిరణ్ ఈ రెండేళ్లు దాదాపుగా హైదరబాద్ ఇంటికే పరిమితమయ్యారు. పాత మిత్రులతో పిచ్చాపాటి మాట్లాడుకోవడం తప్ప ఇప్పుడు రాజకీయాలపై ఆయన మక్కువ చూపడం లేదని సన్నిహితులు చెబుతున్నారు.

ఇకపోతే, లగడపాటి రాజగోపాల్... సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో నాటకీయ ఫక్కీలో నిమ్స్ ఆస్పత్రిలో చేరి హడావుడి చేసిన ఆయన రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు చేశారు. అన్నట్టుగానే ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయకపోగా, గడిచిన రెండేళ్లుగా ఏ వేదికపైనా కూడా ఆయన కనిపించలేదు. ఆయనతో పాటు విశాఖ మాజీ ఎంపీ సబ్బం హరి, మరో మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజులు కూడా ఏ వేదికలపైనా కనిపించడం లేదు.

విభజన జరిగితే తమకు రాయల తెలంగాణ కావాలని నినదించిన మాజీ మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరుల హడావిడి కూడా లేదు. పేరుకు టీడీపీలో చేరినప్పటికీ ఆ పార్టీలో వారికి పెద్దగా పనిలేకుండా పోయింది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగిన శైలజానాథ్ ఆ తర్వాత కిరణ్ ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి, ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. మధ్యలో టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు కూడా సాగినప్పటికీ ఫలించలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన అప్పడుప్పుడు మీడియా సమావేశాల్లో కనిపిస్తున్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ ఆ రోజుల్లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ ఆ తర్వాత తెరపైన పెద్దగా కనిపించడం లేదు. టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తితోనే ఉన్నట్టు చెబుతున్నారు. ఈ రాజకీయ నాయకుల పరిస్థితి ఇలా ఉంటే, సమైక్య ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీవో నేత అశోక్ బాబు రాష్ట్ర విభజన తర్వాత కాలంలో క్రియాశీలంగా లేకపోవడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు