విమర్శలను తిప్పికొట్టలేరా?

22 Oct, 2016 02:35 IST|Sakshi
విమర్శలను తిప్పికొట్టలేరా?

మంత్రుల తీరుపై కేసీఆర్ అసంతృప్తి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నా.. వివరించలేకపోతున్నారు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో బాగున్నా, ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉన్నా కూడా.. విపక్షాల విమర్శలను మంత్రులు తిప్పికొట్టలేకపోతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో వివిధ అంశాల వారీగా మంత్రుల పనితీరును కేసీఆర్ సమీక్షించారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు.. పలువురు మంత్రుల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, రుణమాఫీ అంశాలపై విపక్షాల విమర్శలకు మంత్రులు సమాధానం చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు.

ఈ అంశాల్లో వాస్తవ పరిస్థితిపై పూర్తి వివరాలతో ఒక నివేదిక అందజేయాలని సీఎస్ రాజీవ్‌శర్మను ఆదేశించారు. పన్నుల రూపంలో రాష్ట్రానికి 20%ఆదాయం వస్తోందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నా మంత్రి ఈటల రాజేందర్ సరిగా వివరించలేక పోయారని కేసీఆర్ ప్రస్తావించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రుణమాఫీపై రైతులకు స్పష్టత ఇవ్వలేకపోయార న్నారు. ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపు అంశాన్ని మేనేజ్ చేయలేకపోయారని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద కొంత బకాయిలు చెల్లిస్తామని ప్రైవేటు యాజమాన్యాలతో చర్చించలేకపోయారని మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
‘భగీరథ’పై ఇంత నిర్లక్ష్యమా?
మిషన్ భగీరథ పథకం పనుల్లో జాప్యంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు భగీరథ పనులను పర్యవేక్షించడం లేదని తప్పుబట్టారు. పనులను అనుకున్న రీతిలో, అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు  కృషి చేయాలన్నారు. తొలిసారిగా కేబినెట్ సమావేశానికి హాజరైన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ పథకం పనుల పురోగతిని వివరించారు. ప్రాజెక్టును విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులంతా సహకారం అందించాలని కోరారు.  ఒక్క మారుమూల ప్రాంతాలకు కూడా పైప్‌లైన్ ద్వారా తాగునీటిని అందించాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఆయా జిల్లాల మం త్రులు, భగీరథ అధికారులు హెలికాప్టర్‌లో వెళ్లి, ప్రణాళికలు రూపొందించాలన్నారు. నూ తన సచివాలయం అంశాన్ని కూడా మంత్రుల కు వివరించారు. తూర్పు ముఖంగా కొత్త సచి వాలయ భవనం ఉంటుందని తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు