Rajasthan Election Results 2023: 17 మంది రాజస్తాన్‌ మంత్రుల ఓటమి

4 Dec, 2023 05:08 IST|Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపుగాలులకు పలువురు మంత్రులు ఓటమి దిశలో కొట్టుకుపోయారు. రాజస్తాన్‌ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథి అయిన గోవింద్‌ రామ్‌ మేఘ్వాల్‌ సహా 17 మంది మంత్రులు ఓటమిని చవిచూశారు.

ఓడిన మంత్రుల్లో రమేశ్‌ చంద్‌ మీనా, షాలే మొహమ్మద్, భన్వర్‌ సింగ్‌ భటి, శకుంతలా రావత్, విశ్వేంద్ర సింగ్, ఉదయ్‌లాల్‌ అంజనా, బీడీ కల్లా, జహిదా ఖాన్, ప్రతాప్‌సింగ్‌ కచరియావాస్, భజన్‌లాల్‌ జాతవ్, మమతా భూపేశ్, పర్సాదీ లాల్‌ మీనా, సుఖ్‌రామ్‌ విష్ణోయ్, రామ్‌లాల్‌ జాట్, ప్రమోద్‌ జైన్‌ భయ్యా, రాజేంద్ర యాదవ్‌ ఉన్నారు. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌కు సలహాదారులుగా ఉన్న ఎమ్మెల్యేలు సన్యమ్‌ లోధా, రాజ్‌కుమార్‌ శర్మ, బాబులాల్‌ నగార్, దానిష్‌ అబ్రార్‌సహా ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌ ఆర్య సైతం విజయం సాధించలేకపోయారు. ముఖ్యమంత్రి గెహ్లోత్‌ 25 మంది మంత్రులతో కలిసి ఈసారి తమ గెలుపు అదృష్టాన్ని పరీక్షించుకోగా కొద్దిమంది మాత్రమే గెలుపు తలుపు తట్టారు. సర్దార్‌పుర స్థానంలో గెహ్లోత్‌ గెలిచారు.

నలుగురు బీజేపీ ఎంపీల గెలుపు
బీజేపీ ఏడుగురు ఎంపీలను ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా రంగంలోకి దింపింది. వీరిలో నలుగురు విజయం సాధించారు. విద్యాధర్‌ నగర్‌ బీజేపీ మహిళా ఎంపీ దియా కుమారీ, ఝోట్వారా ఎంపీ రాజ్యవర్ధన్‌ రాథోడ్, తిజారా ఎంపీ బాబా బాలక్‌ నాథ్, రాజ్యసభ సభ్యుడు కిరోడిలాల్‌ మీనాలు గెలిచారు.

>
మరిన్ని వార్తలు