వారిని 20 వరకు ఉద్యోగంలో కొనసాగించండి

1 Jul, 2016 01:30 IST|Sakshi
వారిని 20 వరకు ఉద్యోగంలో కొనసాగించండి

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై హైకోర్టు ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తూ ఈ ఏడాది జూన్ 30 నుంచి పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులను జూలై 20వ తేదీ వరకు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులు కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తాయని తేల్చి చెప్పింది. జూలై 20న తుది విచారణ చేపడతామంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు 60 ఏళ్ల పదవీ విరమణ పెంపును వర్తింప చేయకపోవడాన్ని సవాలు చేస్తూ పునర్విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ, ఇతర సంస్థలకు చెందిన ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యాలపై గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారు ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రారని పునరుద్ఘాటిం చారు. వారి పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలంటే సంబంధిత సంస్థల పాలకమండళ్లు చట్ట సవరణ చేశాక ప్రభుత్వం ఆమోదం తెలపాలన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన లక్ష్మీనర్సింహ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారు ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ప్రాథమికంగా ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోవడం లేదంది.

మరిన్ని వార్తలు