కృష్ణాలో తగ్గిన ప్రవాహాలు

22 Jul, 2016 03:11 IST|Sakshi
కృష్ణాలో తగ్గిన ప్రవాహాలు

జారాలకు 19,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
8.47 టీఎంసీలకు నిల్వ
ఆశాజనకంగా గోదావరి ప్రాజెక్టులు
కొత్తగా 30 టీఎంసీల చేరిక


సాక్షి, హైదరాబాద్ : ఎగువన కృష్ణమ్మ జోరు తగ్గింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు తగ్గాయి. నిన్నమొన్నటి వరకు ఆలమట్టికి లక్ష క్యూసెక్కుల మేర ప్రవాహాలుండగా.. గురువారానికి 27 వేల క్యూసెక్కులకు తగ్గాయి. ప్రవాహాలు తగ్గడంతో దిగువ నారాయణపూర్‌కు నీటి విడుదలను తగ్గించేశారు. దీంతో నారాయణపూర్ నుంచి కూడా కిందకు ప్రవాహాలు తగ్గాయి. గురువారం ఉదయం నారాయణపూర్ నుంచి కేవలం 11,090 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో న మోదైంది. జూరాలకు వస్తున్న ప్రవాహాలతో ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలకుగానూ 8.47 టీఎంసీలకు చేరింది. 19,000 క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగుతున్నాయి.

 గోదావరి ప్రాజెక్టులకు జలకళ
గోదావరి ప్రాజెక్టుల్లో గతేడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి ఆశాజనకంగా ఉంది. సింగూరు, నిజాంసాగర్‌ను మినహాయిస్తే, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లికి కలిపి మొత్తంగా ఈ ఏడాది 30 టీఎంసీల మేర కొత్త నీరొచ్చింది. గత ఏడాదితో ఇదే సమయానికి ఉన్న పరిస్థితితో పోలిస్తే సుమారు 18 టీఎంసీల మేర అదనపు నీరొచ్చింది. ఒక్క ఎస్సారెస్పీకే 13.60 టీఎంసీల కొత్తనీరు వచ్చింది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 90.31 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 18.02 నీటి నిల్వ ఉంది. ఇక ఎల్లంపల్లిలో తొలిసారి 8.36 టీఎంసీల కొత్త నీరు రావడంతో ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 20.18 టీఎంసీలకుగానూ ప్రస్తుతం నీటి నిల్వ 10.49 టీఎంసీలకు చేరింది. కడెం ప్రాజెక్టులో 7.60 టీఎంసీల సామర్థ్యానికిగాను 6.90 టీఎంసీల నీరుంది.

వారంలో ఎల్లంపల్లి ట్రయల్న్
ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆయకట్టు లక్ష్యం 1.65 లక్షల ఎకరాల్లో ఈసారి సుమారు 25 వేల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడారం పంప్‌హౌస్, గంగాధరం పంప్‌హౌస్‌కు మరో వారం రోజుల్లో ట్రయల్ రన్ నిర్వహించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇవి పూర్తయిన తర్వాత డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌కు నీరందించేందుకు ఆగస్టు చివర్లో ట్రయల్ రన్ నిర్వహించాలని భావిస్తున్నారు. సాగుకే కాకుండా మధ్యలో వీలైనన్ని ఎక్కువ చెరువులను నింపాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు