కృష్ణాలో తగ్గిన వరద

30 Sep, 2016 03:42 IST|Sakshi
కృష్ణాలో తగ్గిన వరద

శ్రీశైలం జలాశయంలో 204.7 టీఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్‌లకు వరద ప్రవాహం తగ్గడంతో దిగువకు విడుదల చేసే నీటిని కూడా తగ్గించారు. దాంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు ప్రవాహాలు తగ్గాయి. గురువారం జూరాల ప్రాజెక్టుకు 1.02 లక్షల క్యూసెక్కులు రాగా.. దిగువకు 1.06 లక్షల క్యూసెక్కులు వదిలారు. సాయంత్రానికి వరద ప్రవాహం 60 వేల క్యూసెక్కులకు తగ్గింది. దాంతో.. శ్రీశైలం రిజర్వాయర్‌కు 57,948 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వ 204.79 టీఎంసీలకు పెరిగింది.

శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండాలంటే మరో 11.01 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గినా శ్రీశైలం రిజర్వాయర్ ఎడమ, కుడి గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 41,751 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇందులో 36,126 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. దాంతో సాగర్‌లో నీటి నిల్వ 163.50 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండాలంటే మరో 148.55 టీఎంసీలు అవసరం. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడం.. నైరుతి రుతుపవనాలు తిరోగమించే దశకు చేరుకోవడంతో నాగార్జునసాగర్ ఈ ఏడాది కూడా నిండే అవకాశం కనిపించడంలేదు. ఇక గోదావరి ప్రాజెక్టుల్లోనూ వరద ఉధృతి తగ్గింది.

మరిన్ని వార్తలు