కేంద్రానివి మాటలే.. చేతల్లేవ్‌

25 Mar, 2018 02:10 IST|Sakshi

ఐటీఐఆర్, పరిశ్రమల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు..

విమర్శించడం కాదు.. కేంద్రం నుంచి నిధులు తెండి

బీజేపీ ఎమ్మెల్యేల విమర్శలకు కౌంటర్‌

వచ్చే నెలలో దళిత, గిరిజన, మహిళా పారిశ్రామికవేత్తలకు రాయితీలు

ఐటీ, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చలో కేటీఆర్‌ వివరణ  

సాక్షి, హైదరాబాద్‌: ఐటీఐఆర్, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేద ని, కేవలం మాటలు చెబుతోంది తప్ప చేతలేవీ చూపించడం లేదని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. కేంద్రం సహకరించకున్నా ఐటీ విస్తరణకు చర్యలు చేపట్టామని తెలిపారు.

శనివారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా ఐటీ, పారిశ్రామిక అభివృద్ధిపై సభ్యులు మాట్లాడిన అంశాలకు కేటీఆర్‌ వివరణ ఇచ్చారు. ‘రాష్ట్రంలో పారిశ్రామీకరణపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఫలితంగా దేశంలో ఐటీ విస్తరణ జాతీయ సగటు 9 శాతం ఉంటే రాష్ట్రంలో 14 శాతం ఉంది. 1.2 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. పారిశ్రామిక అభివృద్ధి విషయంలోనూ కేంద్రం మన విధానాలు బాగున్నాయని చెబుతోందే తప్ప నిధులను ఇవ్వడం లేదు’అని ఆరోపించారు.  

త్వరలో సిర్పూర్‌ మిల్లు ప్రారంభం
‘రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మూతపడే పరిస్థితిలో ఉన్న 1,730 పరిశ్రమలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే సిర్పూర్‌ పేపర్‌ మిల్లు ప్రారంభం కానుంది. రేయాన్స్‌ ఫ్యాక్టరీ (బిల్ట్‌) విషయంలో కార్మికులకు కచ్చితంగా న్యాయం చేస్తాం’అని కేటీ ఆర్‌ హామీ ఇచ్చారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజి నెస్‌లో దేశంలో తెలంగాణ తొలిస్థానంలో ఉం దన్నారు. భారీ పరిశ్రమలకే కాకుండా చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల అభివృద్ధికీ చర్యలు చేపడుతున్నామని, ఇప్పటి వరకు 10,195 పరిశ్రమలకు రాయితీలు ఇచ్చినట్లు తెలిపారు. దళిత, గిరిజన మహిళా పారిశ్రామికవేత్తలకు టీ ప్రైడ్‌ కింద ఇచ్చే రాయితీల విషయంలో కొంత ఆలస్యం అవుతోందని, వచ్చే 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా రూ.150 కోట్ల రాయితీలు ఇస్తామని వెల్లడించారు.  

దోచుకెళ్లే వాళ్లను వదిలేసి..
పెద్ద్ద కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు నగదు దోచుకుని దేశం విడిచి పారిపోతుంటే వదిలేస్తున్న కేంద్రం, రిజర్వు బ్యాంకు.. చిన్న పారిశ్రామికవేత్తలను ఇబ్బందులు పెడుతున్నా యని కేటీఆర్‌ విమర్శించారు. ముచ్చర్లలో ఫార్మాసిటీ విషయంలో సమస్యలు ఉన్నా యని, అయితే కేంద్రంతో చెప్పి దాన్ని అడ్డుకుంటామని బీజేపీ సభ్యులు మాట్లాడటం సమంజసం కాదన్నారు.

పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు, జీరో లిక్విడ్‌ డిస్‌చార్జి సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి సూచనలు చేయ కుండా అడ్డుకుంటామని చెబుతూ ఏం సందే శం ఇస్తున్నారని ప్రశ్నించారు. 4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామంటే అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. అందులో భూములు నష్టపోయే వారికి నష్టపరిహారంతోపాటు ఇంటికో ఉద్యోగం (స్కిల్డ్‌ ఉద్యోగం) ఇప్పిస్తామని వెల్లడించారు. ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు.

100 పరిశ్రమలు సిటీ బయటకు..
కాలుష్య కారక 13 పరిశ్రమలను మూసివేశామని, వచ్చే మూడు నెలల్లో 100 పరిశ్రమలను సిటీ బయటకు తరలిస్తామని కేటీఆర్‌ తెలిపారు. పర్యావరణ కాలుష్య రహిత సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని చెప్పారు. భూములను కూడా అడ్డగోలు కేటాయించడం లేదని, గతంలో కేటాయించిన భూముల్లో పనులు చేపట్టని వాటిని వెనక్కి తీసుకున్నామని పేర్కొన్నారు.

మైనింగ్‌ విషయంలోనూ 477 ఒప్పందాలను రద్దు చేశామని తెలిపారు. ‘బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వమని అడిగితే కేంద్రం నుంచి ఉలుకూ పలుకు లేదు. ఐటీఐఆర్‌కు రూ.3,650 కోట్లు ఇస్తామంటే తీసుకోవడం లేదని సభ్యులు మాట్లాడటం సరికాదు. కేంద్రం పైసా కూడా ఇవ్వలేదు. బీజేపీ సభ్యులు బయ్యారం ఫ్యాక్టరీకి అనుమతులు తెచ్చి ఆ క్రెడిట్‌ను వారే పొందవచ్చు’అని సూచించారు.  

వారు పొగుడుతుంటే.. మీరు విమర్శలా?
బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాల వారు, కేంద్ర మంత్రులు రాష్ట్ర విధానాలను ప్రశంసి స్తుంటే ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం విమర్శిస్తున్నారని, కేవలం విమర్శ కోసం విమర్శలు వద్దని, వాస్తవాలు గ్రహించాలని కేటీఆర్‌ హితవుపలికారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక్క బుగ్గపాడ్‌లో మాత్రమే ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సమూల పారిశ్రామీకరణకు చర్యలు చేపడుతున్నామని, జిల్లాల్లో పరిశ్రమల విస్తరణకు చర్యలు చేపట్టామని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు