5 వేల స్కూళ్లకు తాళం!

5 May, 2016 09:53 IST|Sakshi
5 వేల స్కూళ్లకు తాళం!

హేతుబద్ధీకరణ పేరుతో ప్రాథమికోన్నత
పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం
6, 7 తరగతుల స్కూళ్లు సమీప హైస్కూళ్లలో విలీనం!
రాష్ట్రవ్యాప్తంగా 5,475 స్కూళ్లకు ముప్పు
6 లక్షల మంది విద్యార్థులు, 27,500 టీచర్లపై ప్రభావం
వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ ఊసెత్తని సర్కారు.. మరోపక్క టీచర్ పోస్టుల కుదింపు యత్నం
డ్రాపవుట్లు పెరుగుతాయని అధికారుల ఆందోళన
ప్రభుత్వ చర్యలు ప్రైవేటు పాఠశాలలకు ఊతమిచ్చేలా ఉన్నాయంటున్న ఉపాధ్యాయ సంఘాలు  
 
 
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలలకు ఊతమిస్తూ.., ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలను శాశ్వతంగా మూసివేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) అన్న ముసుగు తొడిగింది. ఈ ప్రక్రియతో గత ఏడాది రాష్ట్రంలోని 1,500 ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది. 10 మందికంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలను పక్క గ్రామాల్లోని పాఠశాలల్లో విలీనం చేసింది. ఈ పాఠశాలల్లోని విద్యార్థులు, టీచర్లను పక్కనే ఉన్న మరో స్కూల్లో విలీనం చేశారు.
 
దీనివల్ల పక్క గ్రామాలకు వెళ్లలేని పేద విద్యార్థులు ఉచిత విద్యకు దూరమయ్యారు. ఇప్పుడు రెండో దశ కింద 6, 7 తరగతుల విద్యార్థులుండే ప్రాథమికోన్నత పాఠశాలల మూసివేతకు సిద్ధమవుతోంది. ఇందుకోసం మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారన్న నెపంతో ఈ ప్రాథమికోన్నత పాఠశాలలను పక్క గ్రామాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో లేదా హైస్కూళ్లలో (ఉన్నత పాఠశాలల్లో) విలీనం చేయాలని నిర్ణయించారు. ఇదే జరిగితే రాష్ట్రంలో 5,475 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూతపడతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వేసవి సెలవుల్లోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోపక్క.. వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా, వాటి భర్తీ ఊసెత్తకుండా.. ఉన్న టీచర్ పోస్టులనూ కుదించేలా పావులు కదుపుతోంది. పాఠశాల విద్యలో ప్రాథమిక, ఉన్నత విభాగాలనే ఉంచి, మధ్యలోని ప్రాథమికోన్నత స్కూళ్లను మూసివేయించాలన్నది ప్రభుత్వ విధానమని అధికారులు చెబుతున్నారు. 5,475 ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేస్తే, దాని ప్రభావం దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు, 27,500 మంది టీచర్లపై పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలల మూసివేతతో ప్రాథమిక స్థాయిలో డ్రాపవుట్ల సంఖ్య పెరిగి స్కూళ్లు మూసివేసే పరిస్థితి నెలకొంది. అలా జరిగితే డ్రాపవుట్లు మరింత పెరుగుతాయని అధికారులే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
 
 ప్రైవేటు స్కూళ్లకు ఊతమిచ్చేలా: ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉన్నా అందులో సరిపడా టీచర్లను నియమిచనందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేటు పాఠశాలలకు పంపుతున్నారు. ఇపుడు ఏకంగా ప్రభుత్వ పాఠశాలలే మూతపడితే ఇక తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయివే టులో చేర ్చడం ద్వారా ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించేలా ప్రభుత్వ చర్యలున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండో దశలో ప్రాథమిక స్థాయి పాఠశాలలనూ క్రమబద్ధీకరించాలని భావిస్తున్నారు. నాలుగైదు పాఠశాలలను విలీనం చేసే పనిలో విద్యా శాఖ ఉంది. అక్కడ విద్యార్థుల సంఖ్య 80 మందికన్నా తక్కువగా ఉంటే సాధారణ ప్రాథమిక పాఠశాలగానే కొనసాగిస్తారు. అంతకుమించి ఉంటే ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా భావించి అదనపు టీచర్లు, భవనాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
 
 గుర్తింపు లేని పాఠశాలలెన్నో: రాష్ట్రంలో మొత్తం 60,456 పాఠశాలలున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అందులో ప్రభుత్వ స్కూళ్లు 632, జిల్లాపరిషత్, మండల పరిషత్ స్కూళ్లు 38,587, రె సిడెన్సియల్ స్కూళ్లు 29, మోడల్ స్కూళ్లు 155, కస్తూరిబా బాలికా విద్యాలయాలు 352, మున్సిపల్ స్కూళ్లు 2,116, ఇతర ప్రభుత్వ విభాగాల యాజమాన్యాల్లోని స్కూళ్లు 3,051 ఉన్నాయి. ప్రయివేటు స్కూళ్లు 15,534 ఉన్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ఇది మొత్తం స్కూళ్లలో 25 శాతమే. కానీ ఒకే గుర్తింపు చూపుతూ పలు పాఠశాలలను అనధికారికంగా నిర్వహిస్తున్న సంస్థలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఇటీవల పాఠశాల విద్యాశాఖ జిల్లాల వారీగా తెప్పించిన సమాచారం ప్రకారం 2 వేలకుపైగా స్కూళ్లున్నట్లు తేల్చారు. కానీ అంతకన్నా ఎక్కువగానే గుర్తింపులేని పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు