నేటి నుంచి ‘మెడికల్’ అడ్మిషన్లు

23 Sep, 2016 05:35 IST|Sakshi
నేటి నుంచి ‘మెడికల్’ అడ్మిషన్లు

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లను గురువారం విద్యార్థులకు కేటాయించారు. రెండ్రోజులపాటు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లను ఎంచుకున్న విద్యార్థులకు సీటు పొందిన కాలేజీ వివరాలు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలిపారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్లో కాలేజీలు, సీట్ల జాబితా వివరాలు అందుబాటులో ఉంచారు. 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటులోని కన్వీనర్ కోటాలో ఉన్న 2,075 ఎంబీబీఎస్ సీట్లను, అలాగే 12 డెంటల్ కాలేజీల్లోని 606 సీట్లను (స్పోర్ట్స్, ఎన్‌సీసీ, మిలటరీ కోటా మినహా) భర్తీ చేశారు.

సీట్లు పొందిన విద్యార్థులు శుక్రవారం నుంచి ఈ నెల 25 మధ్యాహ్నం 2 గంటల వరకు కాలేజీల్లో చేరవచ్చని, మరుసటి రోజు నుంచే (26వ తేదీ) తరగతులు ప్రారంభమవుతాయని కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్, మిలటరీకి ఒక శాతం, ఎన్‌సీసీకి 0.5 శాతం సీట్ల కేటాయింపు చేయాల్సి ఉందని.. ఆ ప్రక్రియ కొద్దిగా ఆలస్యమవుతుందని వెల్లడించారు. ఎంసెట్-3లో మొదటి ర్యాంకర్ రేగళ్ల ప్రపుళ్ల మానస ఉస్మానియా మెడికల్ కాలేజీలో, రెండో ర్యాంకర్ పి.శ్రీహారిక గాంధీ మెడికల్ కాలేజీలో, మూడో ర్యాంకర్ తప్పెట తేజస్విని, నాలుగో ర్యాంకర్ జీషాన్ అహ్మద్ జలీలి, ఐదో ర్యాంకర్ ఇక్రమ్ ఖాన్‌లు ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు పొందారన్నారు. ఆరో ర్యాంకర్ అడ్ల శ్రీకంఠేశ్వర్‌రెడ్డి గాంధీ మెడికల్ కాలేజీ, ఏడో ర్యాంకర్ మిట్టపల్లి అలేఖ్య, ఎనిమిదో ర్యాంకర్ నుజాత్ ఫాతిమా ఉస్మానియా మెడికల్ కాలేజీ, తొమ్మిదో ర్యాంకర్ కావ్య బలుసు, పదో ర్యాంకర్ వెంపటి రూపీష్ గాంధీలో సీటు పొందారు.

 ఓపెన్‌లో కటాఫ్ 1,205, ఎస్సీలో 7,125
 రెండ్రోజులపాటు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్‌లో 11,866 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆప్షన్లు ఇచ్చిన వారి వివరాలను పరిశీలించిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు గురువారం కట్ ఆఫ్ ర్యాంకు వివరాలు ప్రకటించారు. ఓపెన్ కేటగిరీలో 1,205 ర్యాంకు వరకు, ఎస్సీ కేటగిరీలో 7,125 ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. ఎస్టీ కేటగిరీలో 5,582, బీసీ ‘ఎ’లో 5,765, బీసీ ‘బి’లో 2,359, బీసీ ‘సి’లో 3,582, బీసీ ‘డి’లో 2,477, బీసీ ‘ఇ’లో 2,582 ర్యాంకుల వరకు కట్ ఆఫ్ వచ్చింది.
 
 ‘ఉస్మానియా’లో బీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్
 రాష్ట్రంలోని 14 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,050 ఎంబీబీఎస్ సీట్లుండగా అందులో 713 బీ కేటగిరీ సీట్లు ఉన్నాయి. వాటికి ఇప్పటికే ఆన్‌లైన్లో దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. శుక్ర, శనివారాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దూర విద్యా కేంద్రం లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి రోజు 9 గంటలకు 1 నుంచి 500 సీరియల్ నంబరు గల విద్యార్థులు, మధ్యాహ్నం 2 గం. నుంచి 500-1,000 నంబర్ విద్యార్థులు హాజరు కావాలని ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు తెలిపాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి 1,001-2,000 నంబర్ విద్యార్థులు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 2,001-4,101 నంబర్ విద్యార్థులు హాజరుకావాలని పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు