మోటార్‌ నడవకున్నా.. ‘మీటర్‌’ మోత!

12 Sep, 2017 01:13 IST|Sakshi
మోటార్‌ నడవకున్నా.. ‘మీటర్‌’ మోత!
ఎత్తిపోతల పథకాలపై కనీస చార్జీలు, లోడ్‌ చార్జీల పేరుతో డిస్కంల బాదుడు
- మోటార్లు ఏడాదిలో నడుస్తున్నవి గరిష్టంగా 90 రోజులే
చార్జీలు మాత్రం 365 రోజులకు వసూలు
 
సాక్షి, హైదరాబాద్‌: మన ఇంట్లోని కూలర్‌ను ఎండాకాలంలో మూడు నెలల పాటు వాడతాం, తర్వాత పక్కన పెడతాం.. కానీ కూలర్‌ ఉందని చెప్పి.. కనీస చార్జీల పేరిట ఏడాదంతా వసూలు చేస్తే..? అదేంటి మరీ దుర్మార్గం.. అంటారు కదా? ప్రస్తుతం నీటి పారుదల శాఖ పరిధిలోని ఎత్తిపోతల పథకాల విషయంలో జరుగుతున్నది ఇదే! రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల మోటార్లు ఏడాదిలో పనిచేసేది 90 రోజులే అయినా.. కనీస చార్జీల పేరిట డిస్కంలు ముక్కుపిండి మరీ 365 రోజులకు బిల్లులు వసూలు చేస్తున్నాయి. ఏటా నీటి పారుదల శాఖ రూ.1,750 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తుంటే... అందులో ఇలా అదనంగా చెల్లిస్తున్న బిల్లు ఏకంగా రూ.350 కోట్ల వరకు ఉండటం గమనార్హం. ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలు పూర్తయితే విద్యుత్‌ అవసరాలు భారీగా పెరుగుతాయి. అప్పుడు ఇలా కనీస చార్జీల పేరిట వేసే మోత ఏకంగా రూ.వేల కోట్లకు పెరిగే అవకాశముంది. 
 
వినియోగం పెరిగిన కొద్దీ మోతే
మోటార్లు నడవని రోజుల్లోనూ డిస్కమ్‌లు బిల్లు వేస్తుండటంతో.. నీటి పారుదల శాఖ రూ.350 కోట్లను అదనంగా చెల్లించాల్సి వచ్చినట్లు అంచనా. ఇక ఆలస్యంగా బిల్లు చెల్లిస్తే భారీగా జరిమానా వసూలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య ఒక్క కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోనే రూ.2.79 కోట్ల మేర ఆలస్య రుసుము వసూలు చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే నిర్మాణంలోని ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తయితే.. ఈ విద్యుత్‌ మోత, కనీస చార్జీల బాదుడు భారీగా ఉంటుందని నీటిపారుదల శాఖ లబోదిబోమంటోంది.
 
వాడకున్నా వాత
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. వాటిల్లో కొన్ని పూర్తయి ప్రారంభంకాగా, మరిన్ని నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి 12,075 మెగావాట్ల వరకు విద్యుత్‌ అవసరమని అంచనా. ప్రస్తుతం అలీసాగర్, గుత్ప, ఉదయ సముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి తదితర 14 ఎత్తిపోతల పథకాల ద్వారా ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతోంది. వీటికి 1,338 మెగావాట్ల మేర విద్యుత్‌ వినియోగం జరుగుతుండగా.. యూనిట్‌కు రూ.6.40 చొప్పున బిల్లు చెల్లిస్తున్నారు. మొత్తంగా గతేడాది చెల్లించిన బిల్లు దాదాపు రూ. 1,750 కోట్లు. కానీ జల వనరుల్లో నీళ్లు లేని సందర్భాల్లో పంపులు, మోటార్లు నడవకున్నా.. డిస్కంలు లోడ్‌ చార్జీలు, కనీస చార్జీల పేరిట భారీగా బిల్లులు వేస్తున్నాయి. 
 
► గతేడాది దేవాదుల ప్రాజెక్టు నుంచి కేవలం 8 టీఎంసీల నీటినే ఎత్తిపోశారు. దాదాపు ఆరేడు నెలల పాటు ఈ ప్రాజెక్టు పంపులు వాడనేలేదు. అయినా ఏకంగా రూ.200 కోట్ల మేర విద్యుత్‌ బిల్లు రావడం గమనార్హం. 
కల్వకుర్తి ప్రాజెక్టులో గతేడాది ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో అసలు మోటార్లే నడవకున్నా.. కనీస చార్జీల కింద రూ. 27 లక్షలు వసూలు చేశారు. మొత్తంగా 13.97 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా.. రూ.88.39 కోట్ల మేర బిల్లు వచ్చింది.
 
ఎనర్జీ ఆడిటింగ్‌ ఎక్కడ?
ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అవుతున్న ఖర్చులను తగ్గించుకునేలా ఎనర్జీ ఆడిటింగ్‌ చేయాలని గతంలో నీటి పారుదల శాఖ, ట్రాన్స్‌కో నిర్ణయించాయి. ఒక కమిటీని కూడా వేశాయి. కానీ తర్వాత ఏదీ ముందుకు కదలలేదు. ఇక కనీస చార్జీల తొలగింపుపై డిస్కంలతో ప్రభుత్వం చర్చించినా ఫలితం లేదు. చార్జీల తొలగింపు అంశం తమ పరిధిలో లేదని, దాన్ని ఈఆర్సీ తేల్చాలని డిస్కంలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై ఈఆర్సీకి లేఖ రాయనున్నట్లు ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. 
 
రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు, విద్యుత్‌ అవసరాలు.. 
మొత్తం ఎత్తిపోతల పథకాలు : 19
అవసరమైన విద్యుత్‌ (మెగావాట్లలో) : 12,075
ప్రస్తుతం పనిచేస్తున్నవి (కొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయి) : 14
వీటికి ఏటా వినియోగం అవుతున్న విద్యుత్‌ (మెగావాట్లలో) : 1,338
గతేడాది చెల్లించిన విద్యుత్‌ బిల్లులు (రూ. కోట్లలో) : 1,750
కనీస చార్జీలు, లోడ్‌ చార్జీల పేరిట వసూలు చేసింది (అంచనా కోట్లలో) : 350
వచ్చే ఏడాదికి అవసరమయ్యే విద్యుత్‌ (మెగావాట్లు) : 3,470
మోటార్లు నడవకున్నా పడే భారం (అంచనా కోట్లలో) : 1,250
భవిష్యత్తులో 12 వేల మెగావాట్లకు పడే భారం (అంచనా కోట్లలో) : 4,800
మరిన్ని వార్తలు