మహిళలు దర్గాలకే వెళ్లి ప్రార్థించాలా?

26 Aug, 2016 19:32 IST|Sakshi
మహిళలు దర్గాలకే వెళ్లి ప్రార్థించాలా?

హైదరాబాద్: ఎక్కడ మహిమ పరిచినా భగవంతుడికి తెలిసిపోతుంది కాబట్టి మహిళలు ప్రత్యేకంగా మసీదులు, దర్గాలకు వెళ్లి ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదని ఉమ్మడి రాష్ట్రాల మైనారిటీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ అన్నారు. ఆథ్యాత్మిక కేంద్రాల సందర్శనలో మహిళలు వినయ విధేయతలతో మెలగాలని సూచించారు. హజీ అలీ దర్గాలోకి మహిళలను అనుమతించాలన్న బాంబే హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన రసూల్ ఖాన్ ఆసక్తికమైన వ్యాఖ్యలు చేశారు.

మహిళలు మసీదుల్లోకానీ, బహిరంగ ప్రదేశాల్లోకానీ ప్రార్థనలు చేయడాన్ని ఇస్లాం ప్రోత్సహించదని, ఆ విషయంలో నిషేధం సమర్థనీయం కాదని రసూల్ ఖాన్ అన్నారు. దర్గాలకు వెళ్లాలా, వద్దా అన్నది వ్యక్తిగత అభిప్రాయమని, అయితే అంతిమతీర్పు(జడ్జిమెంట్ డే) రోజులన ఎవరికివారే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని అన్నారు.'నా పాయింట్ ఏమంటే..మహిళలు దర్గాలకు వెళ్లేకాదు, ఇంట్లోనూ ప్రార్థన చేసుకోవచ్చు. వాటిని దేవుడు వింటాడు. ప్రత్యేక ప్రదేశాల్లో ప్రార్థిస్తేనే అవి దేవుడికి చేరినట్లుకాదు' అని రసూల్ ఖాన్ వ్యాఖ్యానించారు.

అయితే, మారుతున్న కాలాన్ని బట్టి ఇస్లాం సంప్రదాయాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నదని, ఇప్పుడు మహిళలు సైతం మసీదులకు వెళుతున్నారని రసూల్ ఖాన్ గుర్తుచేశారు. హైదరాబాద్ సహా సౌదీ అరేబియాలోని చాలా మసీదుల్లో మహిళలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని తెలిపారు.

మరిన్ని వార్తలు