మోదీ తొలి పర్యటనపై బీజేపీ ఆశలు

6 Aug, 2016 02:39 IST|Sakshi
మోదీ తొలి పర్యటనపై బీజేపీ ఆశలు

* 7న 80 వేల మంది కార్యకర్తలతో మహాసమ్మేళన్
* ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ ముఖ్యనేతలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 7న తొలిసారిగా రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాలతోపాటు  బీజేపీ సభలోనూ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనను పార్టీ బలోపేతానికి వినియోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న పార్టీ కార్యకర్తల మహాసమ్మేళన్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.

దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ భారీ ఆశలు పెట్టుకుంది. మోదీ ప్రసంగాన్ని, కేంద్ర పథకాలను బూత్‌స్థాయిలోకి తీసుకుపోవడానికి అనుగుణంగా వ్యూహం రచించుకుంది. రాష్ట్రంలోని 15 వేల పోలింగ్‌బూత్‌ల పరిధినుంచి ఈ మహాసమ్మేళన్‌కు పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించడానికి ఏర్పాట్లు చేసింది. మొత్తం 75 వేల మంది కార్యకర్తలు, వివిధ స్థాయిల్లోని 5 వేల మంది ముఖ్యనేతలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర పథకాలను కార్యకర్తలతో గ్రామస్థాయిలో ప్రచారం చేయించి, కింది స్థాయినుంచి పార్టీని పటిష్టం చేయాలని బీజేపీ భావి స్తోంది. ఈ సమ్మేళన్‌కు సంబంధించిన ఏర్పాట్లను కేంద్రమంత్రి దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనసభాపక్షనేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తున్నారు.
 
2019లో ప్రత్యామ్నాయం మేమే: లక్ష్మణ్, దత్తాత్రేయ
 రాష్ట్రంలో 2019లో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్రమంత్రి దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీస్టేడియంలో జరిగే మహాసమ్మేళన్ ఏర్పాట్లు పర్యవేక్షించిన సందర్భంగా శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇం టింటికీ ప్రచారం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. 2019 ఎన్నికలు లక్ష్యంగా, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వ్యూహాత్మకంగా పనిచేస్తామని, దీనికి ప్రధాని పర్యటనను వినియోగించుకుంటామన్నారు.

>
మరిన్ని వార్తలు