నా ఫొటో.. నా స్టాంప్..!

16 Aug, 2013 01:24 IST|Sakshi
నా ఫొటో.. నా స్టాంప్..!

సాక్షి/అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్:  పోస్టాఫీసుల్లో నగరవాసులు ‘క్యూ’ కడుతున్నారు. అవును.. మీరు చదివింది నిజమే.! స్పీడ్ కొరియర్, ఇంటర్నెట్ సేవలతో శరవేగంగా దూసుకుపోతున్న హైటెక్‌సిటీలో ఇలాంటి పరిస్థితి ఏంటని ఆశ్చర్యపోతున్నారా? తపాలా శాఖ ప్రవేశపెట్టిన ‘మై స్టాంప్’ సేవల మహిమే ఇదంతా. మహనీయులు, విశిష్ట సందర్భాలకు చిహ్నంగా ముద్రించే తపాలా బిళ్ల (స్టాంపు)ల సరసన మీ ఫొటోతో ఉన్న స్టాంపులు కూడా ఇప్పుడు ముద్రించుకోవచ్చు. కొత్తదనాన్ని ఇట్టే ఒంటబట్టించుకునే నగరవాసులు తమ ఫొటోతో ఉన్న స్టాంప్‌లను ఫ్రెండ్స్‌కు గిఫ్ట్‌గా ఇస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. నగరంలో ఈ తరహా గిఫ్ట్‌ల సందడి ఇప్పుడు ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ‘మై స్టాంప్’ విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
 
ఉద్యోగాలు, పై చదువులకు దరఖాస్తులు.. పుట్టినరోజు, వివాహ వేడుకలకు ఆహ్వానాలు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఇలా సందర్భమేదైనా పోస్ట్ చేయాలంటే పోస్టల్ కవరుపై తపాలా బిళ్లను అంటించాల్సిందే. గతంలో మహనీయులు, విశిష్ట సందర్భాలను గుర్తుకుతెచ్చే చిత్రాలను మాత్రమే స్టాంపులపై ముద్రించేవారు. అయితే మారుతున్న కాలానికి, నగరవాసుల అభిరుచులకు అనుగుణంగా తపాలా శాఖ సైతం తన సేవలను విస్తరించింది.

వినియోగదారుల ఫోటోతో కూడిన స్టాంప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘మై స్టాంప్’ పేరుతో ప్రారంభమైన ఈ సేవలతో మహనీయుల స్టాంపుల సరసన నిలిచే మహత్తర అవకాశం సామాన్యులను వరిస్తోంది. దీనికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా అబిడ్స్ జనరల్ పోస్టాఫీసులో ఈ ఏడాది ఏప్రిల్ 3న ‘మై స్టాంప్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. నగరవాసుల నుంచి అనూహ్య స్పందన రావటంతో ఈ సేవలను క్రమంగా నగరంలోని అన్ని తపాలా శాఖ కార్యాలయాలకు విస్తరించారు.
 
 అందరికీ క్రే జ్
 స్టాంప్ కలెక్షన్ తరహాలో ఇప్పుడు మై స్టాంప్ అనేది క్రేజ్‌గా మారింది. ఇటీవలే నగర మేయర్ మాజిద్ హుస్సేన్ కూడా తన ఫొటోతో ఉన్న స్టాంప్‌ను తీసుకున్నారంటే నగరవాసుల్లో దీనికున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు అబిడ్స్ జీపీఓలో 125 మంది ‘మై స్టాంప్’లను తీసుకున్నట్లు తపాలా శాఖ వర్గాలు తెలిపాయి. మై స్టాంప్‌ను భద్రపరుచుకోవడానికి కొందరు, పేరెంట్స్, స్నేహితుల పుట్టిన, పెళ్లి రోజు వేడుకలకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఇంకొందరు తీసుకుంటున్నారు.
 
 రూ. 300కి 12 స్టాంపులు
 ‘మై స్టాంప్’ కావాలనుకునేవారు తపాలా శాఖ దరఖాస్తుతో పాటు ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్డును జతచేయాలి. స్టాంప్ సైజు ఫొటోతో పాటు రూ. 300 ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఇచ్చిన గంటలోపు ‘మై స్టాంప్’లను వినియోగదారులకు అందిస్తారు. ఒక్కో షీటులో రూ. 5 విలువ గల 12 స్టాంపులుంటాయి. మరిన్ని ఫొటోలు కావాలనుకునేవారు ప్రతీ అదనపు షీటుకు రూ. 60 చెల్లించాలి. ప్రస్తుతం 4 డిజైన్లతో కూడిన స్టాంపులే అందుబాటులో ఉన్నాయి. వీటిని కవర్లు పోస్టు చేసేటప్పుడు మాములు స్టాంపుల తరహాలోనే వాడుకోవచ్చు. వ్యక్తుల ఫొటోలు, కంపెనీ లోగోలు, ఇళ్లు.. ఇలా నచ్చిన వస్తువుల ఫొటోలనూ స్టాంపులపై ముద్రించుకోవచ్చు. అయితే అభ్యంతరకర  చిత్రాలను స్టాంపులపై ఎట్టిపరిస్థితుల్లోనూ ముద్రించరు. వివరాలకు 040-23463509/19 నంబర్‌లలో సంప్రదించవచ్చు.
 
 తొలిస్టాంప్ నాదే..
 చిన్నప్పటి నుంచి స్టాంపుల సేకరణ నా హాబీ. అలాంటిది నా ఫొటోతో స్టాంప్ అంటే నా ఆనందానికి అవధుల్లేవు. ‘మై స్టాంప్’ అందుబాటులోకి రాగానే తొలి స్టాంప్ నాకే లభించడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని ఆల్బమ్‌లో భద్రపరుచుకున్నా.
 - ఎల్. నాందేవ్, తుర్కయాంజాల్, జీపీఓ స్టాంప్ ట్రెజరర్ (రంగారెడ్డి)
 
 గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచా!
 మా తల్లిదండ్రులు, స్నేహితుల పుట్టిన రోజు వేడుకలకు, పండుగలకు వారి ఫొటోతో ఉన్న స్టాంప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచా. మై స్టాంప్‌లు బహుమతిగా ఇచ్చేందుకు చాలా ఉపయోగపడతాయి.
 - రంజాన్ అలీ, గచ్చిబౌలి
 

మరిన్ని వార్తలు