జీహెచ్‌ఎంసీకి జాతీయ పర్యాటక అవార్డు

7 Sep, 2017 04:21 IST|Sakshi
జీహెచ్‌ఎంసీకి జాతీయ పర్యాటక అవార్డు
పర్యాటక ప్రాంతాల్లో ఉత్తమ పౌర సేవల నిర్వహణకు ఎంపిక
 
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మరో జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన పౌరసేవల నిర్వహణ విభాగం కింద కేంద్ర పర్యాటక శాఖ జీహెచ్‌ఎంసీకి 2015–16 సంవత్సరానికి జాతీయ పర్యాటక పురస్కారాన్ని ప్రకటించింది. స్వచ్ఛ కార్యక్రమాలు.. ముఖ్యంగా అత్యంత మెరుగైన రీతిలో పారిశుధ్య నిర్వహణకు చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై సమీక్షించి ఈ అవార్డును ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రపతి చేతులమీదుగా ఈ అవార్డును న్యూఢిల్లీలో అందజేయనున్నారు. 
 
అవార్డుకు ఎంపికైంది ఇలా..  
నగరంలో చేపట్టిన 44 లక్షల చెత్త డబ్బాల ఉచిత పంపిణీ, 2 వేల స్వచ్ఛ ఆటోలు, ఇళ్ల మధ్య చెత్తవేసే ప్రాంతాల ఎత్తివేత, పరిచయ కార్యక్రమం, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ప్రారంభించిన పౌరసేవలు తదితర అంశాలతో కూడిన 50 పేజీల సవివర నివేదికను జీహెచ్‌ఎంసీ కేంద్ర పర్యాటక శాఖకు సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ నేషనల్‌ టూరిజం అవార్డును ప్రకటించింది. హైదరాబాద్‌లోని ప్రధాన పర్యాటక స్థలాలైన గోల్కొండ, చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్‌జంగ్‌ మ్యూజియం, తారామతి బారాదరి, కులీకుతుబ్‌ షా సమాధులు, ఫలక్‌నుమా ప్యాలెస్, పురాని హవేలీ, రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియం, మక్కా మసీద్‌ల వద్ద పర్యాటకులకు కల్పించిన సదుపాయాలపై కేంద్ర పర్యాటక శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. 
 
బాధ్యతను మరింత పెంచింది
పర్యాటక ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ కల్పించిన సదుపాయాలకు కేంద్ర పర్యాటకశాఖ అవార్డు లభించడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు మాపై మరింత బాధ్యతను పెంచింది.
– బొంతు రామ్మోహన్, మేయర్‌ 
>
మరిన్ని వార్తలు