‘సింగూరు’పై పెరుగుతున్న ఒత్తిడి

19 Jan, 2018 01:01 IST|Sakshi

ఇప్పటికే వాటా మేర కేటాయింపులు

తాజాగా 1.42 టీఎంసీలు నిమ్జ్‌కు కేటాయించేలా ప్రతిపాదన

కాళేశ్వరం నీళ్లొస్తే తగ్గనున్న ఒత్తిడి  

సాక్షి, హైదరాబాద్‌: జంట నగరాలు, ఉమ్మడి మెదక్‌ జిల్లా తాగు, సాగు అవసరాలను తీరుస్తున్న సింగూరుపై నీటి అవసరాల పరంగా ఒత్తిడి పెరుగుతోంది. ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న వాటాలకు మించి అవసరాలు పెరుగుతుండటం కొంత ఆందోళనను కలిగిస్తోంది. జంట నగరాలకు కృష్ణాజలాలు అందని సమయంలో సింగూరు వైపే చూడాల్సి వస్తున్న నేపథ్యంలో కొత్తగా జహీరాబాద్‌లో చేపట్టిన నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌)కు కొత్తగా 1.42 టీఎంసీల కేటాయింపులు కోరుతూ ప్రతిపాదనలు రావడం ఒత్తిడిని పెంచేలా ఉంది.

నిజానికి సింగూరు ప్రాజెక్టు సామ ర్థ్యానికి అనుగుణంగా మొత్తంగా 29.91 టీఎంసీల మేర వాటాలున్నాయి. ఇందులో హైదరాబాద్‌ తాగునీటికి 6.96 టీఎంసీల కేటాయింపు ఉండగా, దిగువన ఉన్న ఘణపురం ఆయకట్టుకు 4, నిజాంసాగర్‌ ఆయకట్టుకు 8.35 టీఎంసీలు, సింగూరు కాల్వలకు 2 టీఎంసీలు కేటాయింపు ఉండ గా, మిగతా నీటిని ఆవిరి నష్టాలుగా లెక్కగట్టారు.

అయితే ఇటీవల వాటా నీటిని పునఃసమీక్షించారు. దాన్ని బట్టి మిషన్‌ భగీరథకు 5.45 టీఎంసీ, హైదరాబాద్‌ తాగునీటికి 2.80, ఘణపురం 4.06, నిజాంసాగర్‌ అవసరాలకు 6.35, సింగూరు కాల్వలకు 4, ఆవిరి నష్టాలు 7.24 టీఎం సీలు కేటాయించారు. వాటా మేరకు కేటాయింపులు పూర్తవగా ప్రస్తుతం భగీరథ అవసరాలను కొత్తగా 5.7 టీఎంసీలుగా లెక్కగట్టారు.

దీనికి తోడు నిజాంసాగర్‌ కింద ఉన్న 2లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదలకై ప్రతిసారీ సింగూరుపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఏకంగా సింగూరు నుంచి ఎస్సారెస్పీకి నీటి తరలింపు జరిగింది. ఈ నేపథ్యంలో నిమ్జ్‌కు  ఏటా 1.42 టీఎంసీల కేటాయించాలని ప్రతిపాదన వచ్చింది.  ఇది ఓకే అయితే ఈ నీటిని ఎలా సర్దుతారన్నది ప్రశ్నగా ఉంది.   

మరిన్ని వార్తలు