యాదాద్రి ప్లాంట్‌కు ఓకే

17 May, 2017 07:25 IST|Sakshi
యాదాద్రి ప్లాంట్‌కు ఓకే

- షరతులతో కూడిన పర్యావరణ అనుమతులు
- కేంద్రానికి నిపుణుల కమిటీ సిఫార్సు
- రూ.25 వేల కోట్లు... 4,000 ఉద్యోగావకాశాలు


సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) నిర్మించ తలపెట్టిన 4,000 మెగావాట్ల (5’800) యాదాద్రి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్కేంద్రానికి షరతులతో కూడిన పర్యావరణ అనుమతులివ్వాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) సిఫార్సు చేసింది. ఏప్రిల్‌ 26న జరిగిన ఈఏసీ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా బయట పెట్టింది. దీంతో ప్లాంట్‌ నిర్మాణానికి ప్రధాన అడ్డంకి తొలగినట్టయింది.

రూ.25,099.42 కోట్ల అంచనా వ్యయంతో జెన్‌కో నిర్మిస్తున్న ఈ విద్యుత్కేంద్రం నిర్మాణంలో ప్రత్యక్షంగా 150 మందికి, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి, ఉగ్యోగావకాశాలు లభించనున్నాయి. నిర్మాణం పూర్తయ్యాక ప్రత్యక్షంగా 2,000, పరోక్షంగా మరో 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల విషయంలో ఈఏసీ పలు షరతులు విధించింది. అలాగే ‘బూడిద శాతం 30కి మించకుండా, రైల్వే లైన్‌ ద్వారానే సింగరేణి సంస్థ బొగ్గును సరఫరా చేయాలి. రైల్వే లైన్‌కు భూ సేకరణ కోసం ఎవరినీ నిర్వాసితులను చేయొద్దు. ప్రాజెక్టు నిర్మాణానికి భూగర్భ జలాలను వినియోగించరాదు.’ అన్న అంశాలపై జెన్‌కో నుంచి రాతపూర్వక హామీ కోరింది.

ఈఏసీ విధించిన ఇతర షరతులు...
► వీర్లపాలెంలోని మాడచెలు ప్రాంతం నుంచి కృష్ణా నదిలోకి సహజ నీటి ప్రవాహ వ్యవస్థను సంరక్షిస్తామంటూ జెన్‌కో రాతపూర్వక హామీ ఇవ్వాలి
► 50కి.మీ. దూరంలో ఎక్కడైనా మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీ) ఉంటే ప్లాంట్‌ అవసరాలకు ఆ నీటినే వాడాలి
► ప్లాంట్‌ మధ్యలో నుంచి వెళ్తున్న వాగుకు రెండు వైపులా 100 మీటర్ల స్థలాన్ని చెట్ల పెంపకానికి కేటాయించాలి. హెక్టారుకు 2,500 మొక్కలు పెంచాలి
► ప్రాజెక్టు కింద స్థలాలు కోల్పోయే ప్రజల నైపుణ్యాలను గుర్తించి వారికి జీవనోపాధి కల్పించేందుకు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి. దీనిపై అనుమతులు జారీ తర్వాత మూడు నెలల్లో ప్రణాళికను జెన్‌కో సమర్పించాలి
► ప్రాజెక్టు పరిసరాల్లో ఆధునిక సూక్ష్మ, సేంద్రియ సాగు, సేంద్రియ ఎరువుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలి
► కార్పొరేట్‌ సామాజిక బాధ్యత అమలులో మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకోవాలి. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఏర్పాటు చేయాలి
► యువతకు కంప్యూటర్‌ శిక్షణ అందించేందుకు పాఠశాలలో కంప్యూటర్లు, కంప్యూటర్‌ శిక్షకుడి ఏర్పాట్లు చేయాలి
► స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కింద అన్ని బయో టాయిలెట్లకు నీటి సదుపాయం కల్పించాలి.

మరిన్ని వార్తలు