లాటరీ పేరిట కోటిన్నరకు టోకరా

1 Apr, 2015 02:15 IST|Sakshi

అత్యాశకు పోయి రూ.1.48 కోట్లు
     పోగొట్టుకున్న పారిశ్రామికవేత్త
     లాటరీలో రూ. 9.5 కోట్లు
     గెలిచారంటూ మోసం
 సాక్షి, హైదరాబాద్: ‘‘మీరు కొన్న కారుకు లాటరీలో రూ. 9.5 కోట్లు దక్కింది’’ నగరంలోని ఓ పారిశ్రామికవేత్తకు వచ్చిన మెయిల్ ఇదీ. దీనిని నమ్మిన సదరు పారిశ్రామికవేత్త చీటింగ్ ముఠా ఉచ్చులో చిక్కుకుని వారం రోజుల్లో రూ. 1.48 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. బాలానగర్‌కు చెందిన సూర్యదేవర వెంకటేశ్వరరావుకు ట్రాన్స్‌ఫార్మర్లు తయారు చేసే కంపెనీ ఉంది. రెండు నెలల క్రితం వెంకటేశ్వరరావు ల్యాండ్‌రోవర్ కంపెనీ కారును కొన్నాడు. మార్చి 15న టాటా మోటర్స్ మల్టీపర్పస్ ప్రొడక్షన్ అండ్ మాన్యుఫ్యాక్చర్ కంపెనీ(లండన్) పేరుతో వెంకటేశ్వరరావుకు ‘‘మా కంపెనీ పది లక్షల మంది వినియోగదారుల్లో లాటరీ తీయగా మీరు రెండు నెలల క్రితం కొన్న కారుకు రూ. 9.5 కోట్ల లాటరీ తగిలింది.

డబ్బులు పంపడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. మీ పూర్తి వివరాలు పంపండి’’ అని మెయిల్ వచ్చింది. అది నిజమేనని నమ్మిన బాధితుడు తన వివరాలను వారికి పంపాడు. డబ్బులు అందుకునేందుకు వివిధ పన్నులు చెల్లించాలని చెప్పడంతో వారు చెప్పిన ప్రకారం బాధితుడు వారి అకౌంట్లలో మార్చి 20న కస్టమ్స్ క్లియరెన్స్ కోసం రూ.22 వేలు.. 22న మరో రూ.45 వేలు.. పౌండ్స్‌ను భారత కరెన్సీలోకి మార్చేందుకు ఫీజ్ కింద 21వ తేదీన రూ.1.48 లక్షలు.

మనీ లాండరింగ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసమని 23వ తేదీన రూ. 4.72 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజ్ కోసమని రూ.5.80 లక్షలు, సీవోటీ కోడ్ రిలీజ్ కోసం నాలుగు దఫాలుగా రూ.28.56 లక్షలు, సీవోటీ కోడ్ యాక్టివేషన్ కోసమని రూ.17.82 లక్షలు, రిజర్వ్ బ్యాంకుకు 5.3 శాతం పన్నుల రూపంలో కట్టాలంటే 25వ తేదీన రూ. 49.38 లక్షలు, 26వ తేదీన యాక్టివేషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ ట్యాక్స్ పేరుతో రూ.39.89 లక్షలు ఇలా మొత్తం రూ.1.48 కోట్లు లాటరీ ఫ్రాడ్ ముఠా బ్యాంకు ఖాతాల్లో వేశాడు. మార్చి 27న రూ.9.5 కోట్లు చేతికి అందుతాయని వారు చెప్పినా ఆ డబ్బు చేరలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన వెంకటేశ్వరరావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 

మరిన్ని వార్తలు