జేసీ బ్రదర్స్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలి | Sakshi
Sakshi News home page

జేసీ బ్రదర్స్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలి

Published Wed, Apr 1 2015 2:15 AM

JC Brothers criminal cases must be

ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల డిమాండ్
 
సాక్షి, కడప : పులివెందుల తాగునీటి అవసరాలకు కేటాయించిన నీటిని సైతం దౌర్జన్యంగా దారి మళ్లించిన వారిపై చర్యలు తీసుకోకుండా.. ఆ ఘటన స్థలి పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం నీచమైన చర్య అని ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ధ్వజమెత్తారు. వివేకాకు మద్దతుగా జెడ్పీ సమావేశాన్ని బహిష్కరించి బయటికి వచ్చిన అనంతరం జెడ్పీటీసీ సభ్యులు బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మరక శివకృష్ణారెడ్డి, వేముల ఎంపీపీ లింగాల ఉషారాణి మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ పులివెందుల తాగునీటి కోసం బృహత్తర కార్యక్రమం చేపట్టి...రూ. 55 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణం చేపట్టారన్నారు.

ప్రస్తుతం తుంగభద్ర రిజర్వాయర్ నుంచి వస్తున్న నీటిని కల్లూరు వద్ద జేసీ బ్రదర్స్, సింగనమల నాయకురాలు యామిని బాలలు అక్రమంగా గండ్లు పెట్టి తరలించుకుపోవడం దారుణం అన్నారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పులివెందులకు నీళ్లు తెస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ సతీష్‌రెడ్డి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారని.. నీరు రాకముందే ఇలా ఎవరైనా ర్యాలీలు నిర్వహిస్తారా అని వారు ప్రశ్నించారు.

పైగా నీరు తరలించుకు పోతున్న జేసీ బ్రదర్స్ కూడా సతీష్‌రెడ్డి బంధువులేనని, ఒకరు తెచ్చేది.. మరొకరు తీసుకుపోయేదిలా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ జెడ్పీటీసీలు గిడ్డంగి వారిపల్లె రవికుమార్‌రెడ్డి, వెంగముని యాదవ్, లక్ష్మినారాయణమ్మ, ఎంపీపీలు సుబ్బారెడ్డి, అనసూయమ్మ, కుళ్లాయమ్మ, జయసుధ, మునికుమారి తదితరులు పాల్గొన్నారు.
 
జెడ్పీ వద్ద ధర్నా.. మద్దతు తెలిపిన అఖిలపక్షం
కడపలోని జిల్లా పరిషత్ వద్ద పులివెందుల నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ధర్నా నిర్వహించారు. దౌర్జన్యంగా నీటిని తరలించుకుపోతున్నా అడ్డుకోని పోలీసులు వైఎస్ వివేకాను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. జేసీ బ్రదర్స్‌పై కేసు పెట్టాలని నినాదాలు చేస్తూ జెడ్పీ సమావేశహాలు బయట బైఠాయించారు. ధర్నాకు అఖిలపక్ష నేతలు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, కె.సురేష్‌బాబు, చంద్ర, నజీర్ అహ్మద్ తదితులు మద్దతు తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement