ఆపరేషన్ వినాయక!

29 Sep, 2015 08:23 IST|Sakshi
ఆపరేషన్ వినాయక!

యుద్ధప్రాతిపదికన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన
వ్యర్థాల తొలగింపునకు రంగంలోకి హెచ్‌ఎండీఏ
200 మంది వర్కర్లు, 10 లారీలు, 3జేసీబీల ఏర్పాటు

 
సిటీబ్యూరో : గౌరీ సుతుడు గంగ ఒడికి చేరడంతో నిమజ్జనోత్సవ ఘట్టం ముగిసింది. జంటనగరాల్లోని వేలాది వినాయక విగ్రహాలు సోమవారం రాత్రి 10 గంటల వరకు హుస్సేన్‌సాగర్‌లో నిక్షిప్తమయ్యాయి. వీటి తాలూకూ వ్యర్థాలను యుద్ధప్రాతిపదికన తొలగించేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. సాగర్‌ను జల్లెడ పట్టి నిమజ్జన వ్యర్థాలను వెలికితీసే కార్యక్రమాన్ని అధికారులు సోమవారం అర్థరాత్రి నుంచే ప్రారంభించారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ మార్గ్‌లోని 9 ప్లాట్‌ఫారాల వద్ద నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాల తాలూకు అవశేషాలు, పూలు పత్రి ఇతర చెత్తాచెదారాన్ని సమూలంగా గట్టుకు చేరుస్తున్నారు. నిమజ్జన విగ్రహాలు నీటి అడుగు భాగానికి జారిపోకుండా ఎప్పటికప్పుడు డీయూసీ, ఫ్లోటింగ్ పాంటూన్ ద్వారా వెలికితీసి కుప్పలుగా చేశారు. ఈ వ్యర్థాలను లారీల ద్వారా కవాడీగూడలోని జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డుకు తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశారు.

ఇందుకోసం 200 మంది కార్మికులు, 10 లారీలను వినియోగిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. వ్యర్థాలను మూడు రోజుల్లోనే తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ వైపు 4500 టన్నులు, ట్యాంకుబండ్ వైపు 6-7 వేల మెట్రిక్ టన్నుల మేర వ్యర్థాలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని 9 ఫ్లాట్ ఫారాల వద్ద ఇప్పటికే 1500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించిన అధికారులు మిగిలిన వాటిని తొలగించేందుకు మూడు రోజుల పాటు షిఫ్టుల వారీగా 24 గంటలూ పనులు నిర్వహించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు.   

 బండ్‌కు భరోసా ఏదీ ?
 హుస్సేన్‌సాగర్‌లో ట్యాంకుబండ్, ఎన్టీఆర్ మార్గ్‌ల వైపు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నా... ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే ప్రక్షాళన పనులు చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎన్టీఆర్ మార్గ్ వైపున నిమజ్జనం చేసిన విగ్రహాలను మాత్రమే తొలగించే పనులకు హెచ్‌ఎండీఏ అధికారులు పరిమితమయ్యారు. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంకు బండ్ వైపున నీళ్లలో పడుతున్న విగ్రహాలను వెలికితీసే విషయాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అది లోతైన ప్రాంతం కావడంతో పూడిక తొలగింపు వ్యవహారం అంత సులభం కాదన్న విషయాన్ని కారణంగా చెబుతూ కొన్నేళ్లుగా దాటవేస్తున్నారు. ఏటా అక్కడ పడుతున్న విగ్రహాల వల్ల పూడిక భారీగా పేరుకుపోతోంది. ఇది ట్యాంకు బండ్ ఉనికికే ప్రమాదమని, నీటి నిల్వ సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  
 

>
మరిన్ని వార్తలు