చేపల వ్యర్థాలతో ఏం చేద్దాం!? 

11 Oct, 2023 04:07 IST|Sakshi

రీసైక్లింగ్‌ పద్ధతిలో వినియోగించుకునేందుకు వీలున్న మార్గాల అన్వేషణ 

చిన్నపిల్లలకు, గర్భిణులకు పోషక పదార్థంగా తయారు 

‘ఎకో వైద్య‘శాస్త్రవేత్తల బృందంతో చర్చలు 

హైదరాబాద్‌ కేంద్రంగా పైలెట్‌ ప్రాజెక్టు ఏర్పాటు: పిట్టల రవీందర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: చేపలను శుద్ధి చేసే క్రమంలో ఉత్పత్తయ్యే వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్‌ పద్ధతిలో వినియోగించుకునేందుకు వీలున్న మార్గాలను ఫిషరీష్‌ ఫెడరేషన్‌ అన్వేషణ చేస్తోంది. చేపల వ్యర్థాలను వినియోగించి ఆహార పదార్థాలను తయారు చేయడంతో పాటు చేపలు, కోళ్ల దాణా తయారీలో ఈ వ్యర్ధాలను ముడి పదార్థంగా వినియోగించే ప్రక్రియ అనేక దేశాల్లో ఇప్పటికే అమలులో ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో లభ్యమయ్యే చేపల వ్యర్థ్ధాలతో ప్రయోగాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘ఎకో వైద్య’అనే వ్యర్థ పదార్థాల యాజమాన్య సంస్థకు చెందిన యువ శాస్త్రవేత్తలు ఎం.కన్నడ రావు, విపుల్‌ భావే, విజయ యాత్గల్, సి.ఎస్‌.ఆర్‌.కార్తీక్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని ఫిషరీస్‌ కార్యాలయంలో రాష్ట్ర ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ పిట్టల రవీందర్‌ను కలిసి దీనిపై చర్చించారు. 

చిన్నపిల్లలకు, గర్భిణులకు పోషక పదార్థంగా.. 
చేపలను శుద్ధి చేసే క్రమంలో వెలువడే వ్యర్థాలను దాణా తయారీలో వినియోగించే ముడి పదార్థంగా మార్చడంతో పాటు చిన్నపిల్లలకు, గర్భిణులకు పోషక పదార్థంగా కూడా ఉపయోగపడే విధంగా మార్చే వీలున్న అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకు అనుగుణంగా పరిశోధనలు నిర్వహిస్తూనే ఒక ప్రయోగాత్మక పైలెట్‌ ప్రాజెక్టును హైదరాబాద్‌ కేంద్రంగా ఫిషరీస్‌ ఫెడరేషన్‌ సహాయ సహకారాలతో చేపట్టనున్నట్లు రవీందర్‌ వెల్లడించారు.

హైదరాబాద్‌ నగరంలోని రాంనగర్‌ ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌తో పాటు బేగంబజార్‌ చేపల మార్కెట్లో వెలువడే చేపల వ్యర్థ పదార్థాలను సేకరించి ఈ పైలెట్‌ ప్రాజెక్టు నిర్వహించే ప్రయోగాలకు వినియోగిస్తామని తెలిపారు. జిల్లాల్లో ఏర్పాటు చేసే ఇలాంటి కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ఆయా జిల్లాలకు సంబంధించిన మహిళా మత్స్య సహకార సంఘాలకు అప్పగించాలని కూడా ఆలోచన చేస్తున్నామని ఆయన చెప్పారు.  

మరిన్ని వార్తలు