ఈ ఠాణా.. వసతుల ఖజానా!

10 Jan, 2018 02:26 IST|Sakshi

కార్పొరేట్‌ హంగులతో పంజగుట్ట పోలీసుస్టేషన్‌ నిర్మాణం, నిర్వహణ

ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు రోల్‌మోడల్‌ 

హెల్ప్‌ డెస్క్, జిమ్, యోగా సెంటర్, స్ట్రెస్‌ ఫ్రీ జోన్‌ ఇలా ఎన్నో.. 

కేసుల నమోదులో తగ్గుదల.. పుంజుకున్న రికవరీలు 

ఫలితంగానే దేశంలోనే ‘రెండో ఉత్తమ ఠాణా’గా గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: గందరగోళం మధ్య రణగొణ ధ్వనులు.. చెల్లాచెదురుగా పడిఉండే ఫైళ్లు, కాగితాలు.. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బంది.. సాధారణంగా పోలీసుస్టేషన్‌ పేరు చెప్పగానే ఇవే గుర్తుకొస్తాయి. అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాలను అవలంభిస్తున్న నగర పోలీసులు వీటిని మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.  మౌలిక వసతులకు సంబంధించి పశ్చిమ మండలం పరిధిలోని పంజగుట్ట ఠాణా దేశంలోనే తొలి మోడల్‌ పోలీసుస్టేషన్‌గా అవతరించింది. కేసుల పరిష్కారం, ప్రజల మన్ననలతో ‘సెకండ్‌ బెస్ట్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌ ఇండియా’గా అవార్డును ఇటీవల దక్కించుకున్న నేపథ్యంలో ఆ ఠాణా వివరాలివీ.. 

అడుగడుగునా ఆహ్లాదం..
ఇన్‌స్పెక్టర్, సబ్‌–ఇన్‌స్పెక్టర్ల చాంబర్స్‌తోపాటు పోలీసుస్టేషన్‌ పరిపాలనా విభాగం మొత్తం మొదటి అంతస్తులో ఉంది. మొదటి అంతస్తు వరకూ రాలేని వృద్ధులు, వికలాంగుల వద్దకు పోలీసులే వస్తారు. దీనికి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఉంది. రోజంతా ఒత్తిడితో పని చేసే అధికారులు, సిబ్బందికి హెల్ప్‌ డెస్క్‌ పక్కనే ‘స్ట్రెస్‌ ఫ్రీ జోన్‌’ ఉంది. ఈ జోన్‌లోకి వెళ్లి మెడిటేషన్‌ వీడియోలు చూసి రిలాక్స్‌ అయ్యే ఏర్పాట్లు చేశారు. ఇక్కడే మహిళా సిబ్బందికి ప్రత్యేక రెస్ట్‌ రూమ్‌ ఉంది. స్టేషన్‌ భవనం ఎంట్రీలోనే ఆ రోజుకు ఉత్తమ సేవలు అందించిన సిబ్బంది ఎవరో తెలిపే బోర్డు కనిపిస్తుంది. సాధారణంగా ఏదైనా పోలీసుస్టేషన్‌కు వెళ్లినప్పుడు ఫిర్యాదు చేయడానికి అవసరమైన కాగితం ఫిర్యాదుదారులే తెచ్చుకోవాలి. ఇక్కడ మాత్రం ప్రతి బాధితుడికీ సిబ్బందే కాగితం, పెన్ను అందించడంతో పాటు ఫిర్యాదు రాయడంలో సహకరిస్తారు. ఠాణా రెండో అంతస్తులో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన డైనింగ్‌ ఏరియా మరో ప్రత్యేక ఆకర్షణ.  

సమష్టి కృషి ఫలితంగానే
‘పంజగుట్ట పోలీసుస్టేషన్‌ నిర్వహణ, నేరాల నిరోధం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడం సమష్టి కృషితోనే సాధ్యమైందని.. ఉన్నతాధికారుల ప్రోత్సాహం, సిబ్బంది సహకారం ఫలితంగానే జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఠాణా ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రవీందర్‌ అన్నారు. 2016లో 947 కేసులు నమోదైతే.. గతేడాది ఆ సంఖ్య 773కు తగ్గిందని..2016లో రికవరీ 84%గా ఉంటే... గతేడాది 87 శాతానికి పెరిగిందని చెప్పారు. 

ఏ ఫైల్‌ అయినా 30 సెకన్లలోనే..
అలాగే ఏదైనా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫలానా ఫైల్‌ కావాలని అడిగితే దాన్ని వెతకడానికి గంటలు, రోజులు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే పంజగుట్ట ఠాణాలో వీటి నిర్వహణను పక్కాగా పర్యవేక్షిస్తున్నారు. కేసు.. అది నమోదైన సంవత్సరం, వాటి తీరుతెన్నుల వారీగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఫైళ్లలో భద్రపరుస్తున్నారు. ఫలితంగా పంజగుట్ట ఠాణాలో ఏ కేసుకు సంబంధించిన ఫైల్‌ అయినా 30 సెకన్లలోనే బయటకు తీసేందుకు ఆస్కారం ఏర్పడింది. వీటికితోడు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ను ఉంచారు. మూడో అంతస్తులో అధికారులు, సిబ్బంది కోసం జిమ్, యోగా ఏరియాలను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. వీటితో పాటు రిలాక్స్‌ ఏరియా, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్, మినీ లైబ్రరీ, రీడింగ్‌ ఏరియా, గవర్నమెంట్‌ ప్రాపర్టీ రూమ్, క్లూస్‌ టీమ్, కేస్‌ ప్రాపర్టీ డిపాజిట్‌ రూమ్‌ తదితరాలన్నీ ఈ అంతస్తులోనే ఉన్నాయి. ఈ పోలీసుస్టేషన్‌ మిద్దెపై సేంద్రియ పద్ధతిలో ‘పంటలు’ పండిస్తున్నారు

మరిన్ని వార్తలు