‘పంచకూటాలయం’పై పంచాయితీ!

16 Sep, 2016 01:41 IST|Sakshi
‘పంచకూటాలయం’పై పంచాయితీ!

* చారిత్రక ఆలయ పునర్నిర్మాణంపై రాజకీయ తకరారు
* మంత్రి చందూలాల్ ఇలాఖాలో విడ్డూరం
* పనులు మొదలు కాకుండా అధికార పార్టీ నేతల అడ్డంకులు
* కాంగ్రెస్ నేతలకు పేరొచ్చేలా ఉందని అధికారులపై ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్: అది 13వ శతాబ్దంలో నిర్మితమైన అద్భుత మందిరం... కాకతీయుల శిల్పకళావైభవంతో రూపుదిద్దుకున్న పంచకూటాలయం.. కాలక్రమంలో శిథిలమైన ఆ మందిరాన్ని అనువైన మరోచోట పునర్నిర్మించాలని పురావస్తుశాఖ రెండున్నర దశాబ్దాల క్రితం నిర్ణయించింది.

నిధుల లేమి, అనువైన స్థలం లేక పునర్నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. తాజాగా రూ. కోటి నిధులు, ఎకరం స్థలం లభించినా రాజకీయ పంచాయితీ రూపంలో పనులకు మళ్లీ అవాంతరం ఎదురైంది. ఇదంతా జరుగుతున్నది రాష్ట్ర పర్యాటక, పురావస్తుశాఖ మంత్రి చందూలాల్ ఇలాఖాలోనే! పనులను అడ్డుకుంది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీకి చెందిన నేతలే..!!
 
రామప్పకు చేరువలోనే...
యునెస్కో చారిత్రక వారసత్వ గుర్తింపు హోదా కోసం పోటీపడుతున్న రామప్ప దేవాలయానికి కూతవేటు దూరంలో పంచకూటాలయం ఉంది. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం ప్రస్తుత రామానుజాపూర్ గ్రామ శివారులో 13వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఇందులో ఒకే రంగమండపంతో 5 విడివిడి ఆలయాలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్న 2 పంచకూటాలయాల్లో ఇదీ ఒకటి. వేణుగోపాలస్వామి ప్రధాన దేవతామూర్తిగా ఆలయం రూపుదిద్దుకుంది.

ప్రధానాలయంలో వేణుగోపాలస్వామి విగ్రహాన్ని దుండగులు చాలా ఏళ్ల క్రితమే తస్కరించగా ఉమామహేశ్వర స్వామి ఆలయం మాత్రం స్పష్టంగా ఉండేది. శ్రీకృష్ణుని లీలలతో కూడిన చిత్రాలు ఉండటంతో దీన్ని వేణుగోపాలస్వామి ఆలయం అని చరిత్రకారులు నిర్ధారించారు. పొలాల మధ్య, ఓ చిట్టడివిని తలపించే ప్రాంతంలో ఆలయం ఉండటం, అప్పటికే ఆలనాపాలనా కరువవడం, ముస్లిం రాజుల దాడిలో చాలా వరకు శిథిలమవటంతో ఆలయ ప్రాభవం తగ్గిపోయింది. దీంతో రెండున్నర దశాబ్దాల క్రితం ఆలయాన్ని గ్రామానికి చేరువగా పునర్నిర్మించాలని పురావస్తుశాఖ నిర్ణయించింది.

ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో ఆలయ రాళ్లను జాగ్రత్తగా విప్పదీశారు. అప్పటికే గుర్తించిన స్థలంలో నిర్మిద్దామనుకునేసరికి అది అటవీ శాఖ భూమిగా తేలింది. దీంతో మరో స్థలం కోసం ప్రయత్నించినా దొరకలేదు. ఈ లోగా నిధులకు ఇబ్బంది రావటంతో ఆ ప్రక్రియను అటకెక్కించారు.
 
రూ. కోటి నిధులు సమకూరినా...
ఆలయ పునర్నిర్మాణం మూడేళ్ల క్రితం మరోసారి తెరపైకి వచ్చింది. 12వ ఆర్థిక సంఘం నిధుల్లో మిగిలిన సొమ్ముతోపాటు 13వ ఆర్థిక సంఘం కేటాయింపులో కొంత కలిపి దానికి దాదాపు రూ. కోటి వరకు కేటాయించారు. స్థలం దొరికితే పనులు మొదలుపెట్టాలనుకోగా ఆ ప్రాంతానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత ఎకరం స్థలాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని గ్రామకంఠం భూమిగా గుర్తించిన అధికారులు అక్కడే పనులు మొదలు పెట్టాలనుకొని అంతా సిద్ధం చేసుకున్నారు. దాదాపు రూ.10 లక్షలు వెచ్చించి స్థలాన్ని అనువుగా మార్చారు. కానీ ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. ప్రతిపాదిత స్థలంలో ఆలయాన్ని పునర్నిర్మిస్తే కాంగ్రెస్ నేతలకు పేరొస్తుందని అధికార టీఆర్‌ఎస్ నేతలు ఆందోళన మొదలుపెట్టారు.

పైగా స్థానిక ఎమ్మెల్యే(ములుగు నియోజకవర్గం),స్వయంగా పురావస్తుశాఖను పర్యవేక్షిస్తున్న మంత్రితో భూమి పూజ చేయించకపోవడాన్ని తప్పుపడుతూ పురావస్తుశాఖ అధికారులపై శివాలెత్తారు. ఫలితంగా పనులు మొదలు కాలేదు. నిధులు మురిగిపోయే పరిస్థితి ఉండటంతో అధికారులు టీఆర్‌ఎస్ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతం ఆలయ శిల్పకళా సంపద బురద, మట్టిదిబ్బల్లో కూరుకుపోయి పిచ్చి మొక్కల మధ్య దర్శనమిస్తోంది.

మరిన్ని వార్తలు