ఇది విమోచన దినమే! | Sakshi
Sakshi News home page

ఇది విమోచన దినమే!

Published Fri, Sep 16 2016 1:42 AM

ఇది విమోచన దినమే! - Sakshi

 అభిప్రాయం
 విమోచనం అయితేనేం..? విలీనం అయితేనేం? నిజాం నిరంకుశత్వం నుంచి తెలంగానం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు, ప్రజలు కోరుకున్న స్వాతంత్య్రం సిద్ధించిన రోజు సంబురం కాకుండా ఎలా ఉంటుంది?
 
పాలకుడనేవాడు చరిత్రను గౌరవించాలి. కాలానుగు ణంగా జరిగిన మార్పులు చరిత్రను మసకబార్చలేవు. ఆధునిక కాలంలో జరిగిన ఉద్యమాలు పూర్వ ఉద్య మాలు రగిలించిన స్ఫూర్తిని తుడిచిపెట్టలేవు. చరిత్రను పునర్ లిఖించుకోవడం అంటే, గత చరిత్రను రూపు మాపుకోవడం కాదు. వక్రీకరించడమూ కాదు. చరిత్ర ఏదైనా దానిని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నవారు ఉంటారు. ముందే ఏర్పరుచుకున్న లేదా సొంత అభిప్రా యాలతో గతాన్ని సరిపోల్చుకుని చూసుకుంటూ, నిజ మైన చరిత్ర ఇది కాదని వాదించేవారు ఉన్నారు. ఇక కలం-బలం తోడు ఉన్న వాళ్లు కొందరు చరిత్రని మార్చే ప్రయత్నం చేశారు కూడా. ఈ చరిత్ర మాది, మేం లేకపోతే చరిత్ర లేదు, మాతోనే చరిత్ర మొదలయింది, లేకుంటే అది చరిత్ర కాదు, అలాంటి చరిత్ర ఉండ రాదంటూ వాదించినవారూ ఉన్నారు.
 
సరిగ్గా ఇలాంటి వాతావరణమే ఇవాళ తెలం గాణలో ప్రతిబింబిస్తున్నది. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినమా? విలీనమైన రోజా? లేక విద్రోహమా? మొదట ఇది తేలాలని అంటున్నారు. కొందరి మనోభావాలను గాయపరచడం ఇష్టం లేక, ఆ కారణంగానే సెప్టెంబర్ 17 దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేకపోతున్నదని నిర్మొహమా టంగా ప్రకటిస్తూ యావత్ తెలంగాణను విస్మయ పరుస్తున్నారు. పోరాటంతో వచ్చిన నవ తెలంగాణ, నయా నిజాం తీరును చూసి విస్తుపోతున్నది. తెలం గాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని గతంలో గళమెత్తిన గొంతులే ఇప్పుడు గాడి తప్పడం గమనించి ప్రజల గొంతులే గద్గదమవుతున్నాయి. నవ్వి పోదురు గాక నాకేటి వెరపు అన్న చందంగా పాలకులు మాట మారుస్తున్నారు.

ఈ వ్యవహారం నిజంగా సామాన్య ప్రజలను వ్యాకుల పరుస్తున్నది. తెలంగాణ అంటే దగాకోరుల వారసత్వమా లేక దగా పడే ప్రజలకు బానిసత్వమా అని మువ్వన్నెల జెండా సాక్షిగా ప్రశ్నిస్తున్నారు. జాతీయవాదుల అండతో తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నారు. కానీ వినేవారు ఎవరు? చెవిటివాని ముందు శంఖం ఊదటం వ్యర్థమన్నది పాత సామెత. పాలకులకు చెబితే ఎంత! చెప్పకపోతే ఎంత! రెండింటికీ పెద్ద తేడా లేదు అనేది నేటి నానుడి. ఎందుకంటే మన తెలంగాణలో తెలంగాణ పాలకులు ప్రజల గొంతుకలను గౌరవించటం మానుకొని చాలా కాలమయింది కనుక.
 
అసలు విమోచనం అయితేనేం..? విలీనం అయి తేనేం? వివాదమెందుకు? నిజాం నిరంకుశ దాస్య శృంఖలాల నుంచి తెలంగానం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు, ప్రజలు కోరుకున్న స్వాతంత్య్రం సిద్ధించిన రోజు సంబురం కాకుండా ఎలా ఉంటుంది? ఉత్సవం కాకుండా ఎలా ఉంటుంది? నిశీధి విడిచిన జామును ఉదయ కిరణాలు స్పృశించాక ఎలా ఉంటాయి? అంధకార బంధురమైన జీవితానికి వెలుగొచ్చినపుడు వసంతం కాదని ఎలా అంటాం?

 పాలకులకు,  తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ‘సెప్టెంబర్ 17’ అధికారికంగా ప్రభుత్వమే నిర్వహిం చాలన్న డిమాండ్‌ను ఏదో రకంగా అల్పమయిన విష యంగా పక్కదోవ పట్టించే వారికొక మనవి. ఆత్మ వంచన వీడండి! బానిస మనస్తత్వాలను సంస్కరించు కోండి! ఓట్ల రాజకీయమే పరమావధి కాదని గుర్తించండి!
 
పురాణాల్లోని నరకాసుర వధను పండుగగా జరు పుకుంటున్న మనం, మన తెలంగాణ పూర్వీకుల జీవి తాలను దుర్భరంగా చేసినవారి, అదే విధంగా వేలా దిమంది ప్రజల ప్రాణాలను బలిగొన్న రజాకారా సురుల పాలనాంతాన్ని ఉత్సవంగా ఎందుకు జరుపు కోలేం? అధికారికంగా జరపొద్దనే కొందరి వాదన ఓట్లకోసం చేసుకుంటున్న ఆత్మవంచనే తప్ప మరోటి కాదు. వితండవాదానికి పరాకాష్ట తప్ప మరోటి కాదు.
 బ్రిటిష్ పాలకుల రాచరికపు, నిరంకుశ పాలన నుంచి భారతావనికి వచ్చినది స్వాతంత్య్రమయినప్పుడు, నిజాం రాచరికపు పాలన నుంచి విముక్తులైన తెలం గాణ ప్రజలకు వచ్చినది స్వాతంత్య్రం కాదా? విమో చనం కాదా? ఆత్మ బలిదానాల, ఆత్మాభిమానాల త్యాగ ధనం విమోచనమా? విలీనమా? విద్రోహమా? తేల్చు కోవాల్సిన తరుణమిది.
 
‘విద్రోహం’ అనేది - నాటి తెలంగాణ స్వాతంత్య్ర వీరుల త్యాగాలను అవమానపరుస్తుంది.
 ‘విలీనం’ అనేది - నిజాం నిరంకుశ చరిత్రను సమర్థించినట్లవుతుంది.
 ‘విమోచనం’ అనేది మాత్రమే - ఆనాటి త్యాగ ధనుల స్ఫూర్తిని నిలబెడుతుంది.
 ఏది ఏమైనా తెలంగాణ ప్రజలందరూ ఏకమై అనేకమై ఒక్క గొంతుకతో నినదించాలి. సెప్టెంబర్ 1న మువ్వన్నెల జెండా చేత పూని తిరంగా స్ఫూర్తిని చాటాలి. స్వాతంత్య్ర స్వేచ్ఛావాయువులను నలుదిశలా వీచేలా చేయాలి. నిజానికి ఈ మహత్కార్యానికి ప్రభుత్వం కూడా సహకరించాలి. అధికారికంగా వేడు కలను నిర్వహించాలి. లేకుంటే అదే అసలైన విద్రోహం. అప్పుడు ప్రజలు మరో విమోచన కోసం ఉద్యమిస్తారు. ఇది నిజం. ఇది తథ్యం.
 (తెలంగాణ విమోచన దినం సందర్భంగా)
 


 ఆర్. శ్రీధర్ రెడ్డి
 వ్యాసకర్త బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
 మొబైల్: 99855 75757
 

Advertisement
Advertisement