ఈ బురదనీళ్లు తాగలేం..

12 Dec, 2015 02:45 IST|Sakshi
ఈ బురదనీళ్లు తాగలేం..

- గోదావరి జలాలపై పలు కాలనీల ప్రజల గగ్గోలు
- నగరంలోని పలు కాలనీలకు గోదావరి జలాలు సరఫరా
- నల్లాల్లో వస్తున్న బురద, మట్టితో కూడిన నీరు
- కలుషిత నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్న జనం
- కాంట్రాక్టరు నిర్లక్ష్యం.. అసంపూర్తిగా మల్లారం ఫిల్టర్‌బెడ్స్?
- ప్లాంట్ల నుంచి ఫిల్టర్ నీళ్ల కొనుగోలుతో జనం జేబులకు చిల్లు
- నీటి నాణ్యత సరిగాలేక సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో నిలిచిన ఆపరేషన్లు.. రోగుల ఆందోళన
 
సాక్షి, హైదరాబాద్

నల్లా నీరు బురదమయంగా ఉంటోంది. విధిలేక ఫిల్టర్ ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిని కొనుగోలు చేస్తున్నాం. డిమాండ్ అధికంగా ఉండడంతో ప్లాంట్ల నిర్వాహకులు 20 లీటర్ల నీటి క్యాన్ ధరను రూ.30 నుంచి రూ.40కి పెంచేశారు. తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నాం.    
 - శారద, కూకట్‌పల్లి


గోదావరి జలాలు బురదతో వస్తున్నాయి. ఈ నీటిని కాచి చల్లార్చి తాగాలని అధికారులు చెపుతున్నా.. ఎటువంటి ఉపయోగం ఉండటం లేదు. ఈ నీటిని తాగడం వల్ల చిన్నా, పెద్దా అంతా గొంతు నొప్పి, జలుబుతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం.
- లక్ష్మి, కుత్బుల్లాపూర్

గోదావరి బురద జలాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు నిదర్శనం వీరి మాటలు. నల్లాల్లో నిత్యం బురద, మట్టి కలసిన నీళ్లు సరఫరా అవుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఫిల్టర్ ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిని కొనుగోలు చేయాలంటే జనం జేబులు గుల్లవుతున్నాయి.

సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నీటిసరఫరా నిలిచిపోవడంతో నగర శివార్లలోని ఘన్‌పూర్ రిజర్వాయర్‌కు 56 మిలియన్ గ్యాలన్ల గోదావరి జలాలను తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఈ నీటిని కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, సనత్‌నగర్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని పలు కాలనీలు, బస్తీలకు అరకొర నీటి సరఫరాతోపాటు బురద, మట్టి రే ణువులు కలసిన జలాలు సరఫరా అవుతుండటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

బురద నీటి కారణంగా ఫిల్టర్‌నీటిని కొనుగోలు చేయాలన్నా.. నలుగురు సభ్యులున్న ఒక్కో కుటుంబం రోజుకు రూ.100 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అటు కుత్బుల్లాపూర్‌లో గోదావరి జలాలు సరఫరా అయి పక్షం రోజులు గడిచినా బురద నీళ్లే దిక్కయ్యాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు ఈ నీటిని తాగి అనారోగ్యాల బారినపడుతున్నారు. గోదావరి రింగ్ మెయిన్-1 పైపులైన్‌లను శుద్ధి చేసి మూడు రోజుల్లో స్వచ్ఛమైన నీటిని అందిస్తామని జలమండలి అధికారులు ప్రకటించినా.. ఆచరణలో విఫలమయ్యారు.

కాంట్రాక్టరు నిర్లక్ష్యమే కారణం..
కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివార్లలోని ఘన్‌పూర్ వరకు మొత్తం 186 కి.మీ మార్గంలో గోదావరి పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి. గోదావరి జలాలను శుద్ధి చేసేందుకు మల్లారం(కరీంనగర్ జిల్లా)లో ఉన్న నీటిశుద్ధి కేంద్రంలో 52 ఫిల్టర్‌బెడ్స్ ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం ఇందులో 17 మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. వీటిపైనే రోజువారీగా నగరానికి తరలిస్తున్న 56 ఎంజీడీల గోదావరి రావాటర్‌ను అరకొరగా శుద్ధి చేస్తున్నారు.

దీంతో గోదావరి జలాల్లోని బురద, మట్టి రేణువులు, చెత్తాచెదారం పూర్తిస్థాయిలో తొలగడం లేదని తెలిసింది. 52 ఫిల్టర్‌బెడ్స్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసే విషయంలో సదరు కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇవి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే వరకు బురదనీళ్లతో జనానికి అవస్థలు తప్పే పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు బురద, మట్టి ఎక్కువ శాతం ఉండడంతో ఇళ్లల్లోని వాటర్ ఫిల్టర్లు చెడిపోతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు.

ప్రస్తుతం నగరానికి నీటి సరఫరా ఇలా..
నగరానికి రోజువారీగా ఉస్మాన్‌సాగర్(గండిపేట్) నుంచి 3.50 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్ నుంచి 5.50 ఎంజీడీలు, కృష్ణా మూడు దశల నుంచి 259.35 ఎంజీడీలు, గోదావరి నుంచి 56 ఎంజీడీలు.. మొత్తంగా 324.35 ఎంజీడీల నీటిని నగరంలోని 8.64 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది.


సరోజినిదేవి ఆస్పత్రిలో నిలిచిన ఆపరేషన్లు
హైదరాబాద్:
సరోజిదేవి కంటి ఆస్పత్రికి నీటి సరఫరా బంద్ కావడంతో మూడు రోజులుగా శస్త్రచికిత్సలను నిలిపేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొందరు రోగులు శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ప్రతి రోజూ 50 నుండి 60 మంది రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు. మూడు రోజుల నుంచి శస్త్రచికిత్సలు ఆగిపోవడంతో ఆపరేషన్లు చేయాల్సిన రోగుల సంఖ్య మూడు వందలకు చేరుకుంది.  ఆస్పత్రిలో చేరిన రోగులకు శస్త్రచికిత్సలు చేయకపోవడంతో ఆపరేషన్లు చేసేటప్పుడు వేసే దుస్తులతోనే కొందరు రోగులు ఇంటిదారి పట్టారు.

కాగా, ఆస్పత్రికి మూడు రోజులుగా నాణ్యత సరిగా లేని నీరు సరఫరా అవడంతో కాటరాక్ట్ ఆపరేషన్ల కోసం నగరంలోని నలు మూలల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ వినోద్ ‘సాక్షి’కి తెలిపారు. అత్యవసర ఆపరేషన్ల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు మాత్రం ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. నాలుగు కనెక్షన్ల ద్వారా ఆస్పత్రికి సరఫరా అవుతున్న నీటి నాణ్యతను తెలుసుకునేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు నీటి నమూనాలు పంపించామని తెలిపారు.
వారం తర్వాత రమ్మన్నారు..
‘కనులు మసకబారడంతో గత నెలలో సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో చూపించుకున్నాను. ఈ నెల 9న శస్త్రచికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాను. దవాఖానాలో నీటి సమస్య ఏర్పడటంతో వారం తర్వాత రమ్మని డాక్టర్లు చెప్పడంతో ఇంటికి వెళ్తున్నా.’
- ఆషాం అలీ, అంబర్‌పేట

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా