నిర్వాసితులపై లాఠీ

25 Jul, 2016 03:27 IST|Sakshi

ఉద్రిక్తతకు దారితీసిన మల్లన్నసాగర్ నిర్వాసితుల ఆందోళన
రాజీవ్ రహదారి దిగ్బంధనానికి కదిలిన పల్లెపహాడ్, ఎర్రవల్లి ప్రజలు
మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు.. ఇరుపక్షాల మధ్య తోపులాట
పరిస్థితి చేయిదాటడంతో లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు
గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు.. భయంతో పరుగులు తీసిన
ఆందోళనకారులు.. పోలీసులపైకి రాళ్లు
గాయపడ్డ నిరసనకారులు, పోలీసులు
లాఠీచార్జికి నిరసనగా నేడు మెదక్ బంద్‌కు ప్రతిపక్షాల పిలుపు

 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/తొగుట/గజ్వేల్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు తలపెట్టిన రాజీవ్ రహదారి దిగ్బంధం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల లాఠీచార్జి, నిర్వాసితుల ఆగ్రహావేశాలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీలతో విరుచుకుపడటం, గాల్లోకి కాల్పులు జరపడంతో మెదక్ జిల్లా పల్లెపహాడ్, ఎర్రవల్లి గ్రామాల్లో భయానక పరిస్థితి ఏర్పడింది. ఇందులో అటు నిర్వాసితులు, ఇటు పోలీసులు గాయాలపాలయ్యారు.

అసలేం జరిగింది?: ఆదివారం ముంపు గ్రామాల ప్రజలు రాజీవ్ రహదారి దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. దీంతో వేములఘాట్ నుంచి పల్లెపహాడ్ చౌరస్తా, ఎర్రవల్లి మీదుగా కుకునూర్‌పల్లిలోని మంగోల్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై ధర్నా చేసేందుకు రైతులు, మహిళలు భారీగా కదిలారు. ర్యాలీ పల్లెపహాడ్ సబ్‌స్టేషన్ వద్దకు చేరుకోగానే సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
 
 ఈ సందర్భంగా నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీ చార్జికి దిగారు. అనుకోని ఘటనతో మహిళలు భయంతో సమీప పంట పొలాల్లోకి పరుగులు పెట్టారు. అయినా నిర్వాసితులు బెదరకుండా ఎర్రవల్లి వైపు వచ్చారు. దీంతో డీఎస్పీ మరింత మంది పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో వేములఘాట్ గ్రామస్తులకు ఎర్రవల్లి నిర్వాసితుల మద్దతు తోడైంది. పోలీసులకు, ఆందోళనకారులకు మరోసారి తోపులాట జరిగింది. పోలీసులు మళ్లీ దొరికిన వారిని దొరికినట్టు బాదారు. కొందరు భయంతో ఇళ్లల్లోకి వెళ్లగా బయటికి ఈడ్చుకొచ్చి కొట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. సుమారు 30 నిమిషాల తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఆ తర్వాత నిర్వాసితులు మళ్లీ పోగయ్యారు. ‘ఊర్లపై పడి భయపెడతారా..’ అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరుపక్షాల మధ్య మరోసారి తోపులాట జరగడంతో పోలీసులు మళ్లీ లాఠీచార్జి జరిపారు. వేములఘాట్, ఎర్రవల్లికి చెందిన మహిళలు, రైతులు చాలామంది గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం గజ్వేల్, సిద్దిపేట ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో కుకునూర్‌పల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, కానిస్టేబుల్ రమేశ్ గాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు