విన్నవించుకోవడానికి వస్తే వెళ్లగొట్టారు

13 Sep, 2017 03:24 IST|Sakshi
విన్నవించుకోవడానికి వస్తే వెళ్లగొట్టారు
‘లోధా’ బాధితులపై పోలీసుల ప్రతాపం
- జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వచ్చిన బాధితులు.. అధికారులకు తమ సమస్యలు చెప్పేందుకు యత్నం 
- కొందరినే అనుమతించి.. మిగిలిన వారిని బలవంతంగా తరలించిన పోలీసులు
 
సాక్షి, హైదరాబాద్‌: తమ సమస్యలు విన్నవించుకుందామని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ‘లోధా’బాధితులకు చేదు అనుభవం ఎదురైంది. వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. వృద్ధులు, మహిళలని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. దీంతో లోధా బాధితులు, పోలీసులకు మధ్య వాదోపవాదనలతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ‘లోధా హెల్తీ కన్‌స్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ వద్ద కోటి రూపాయలకు పైగా వెచ్చించి ఫ్లాట్లు కొనుగోలు చేసిన దాదాపు 150 మంది తమ బాధలను విన్నివించుకునేందుకు మంగళవారం కుటుంబాలతో పాటు జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు.

అధికారుల తీరుపై నిరసన తెలిపేందుకు వారంతా సిద్ధమవుతుండగా, జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో లోధా బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. బాధితులను జీహెచ్‌ఎంసీ కార్యాలయం ప్రధాన గేటు బయటకు పంపి అక్కడి నుంచి పోలీస్‌ వ్యాన్‌లో తరలించారు. జీహెచ్‌ఎంసీ మర్యాదమాసం అని చెబుతున్న సమయంలో తమను తీవ్రంగా అవమానించి వేదనకు గురిచేశారని లోధా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
నిబంధనల మేరకు చర్యలు: కమిషనర్‌ 
కేపీహెచ్‌బీ సమీపంలో లోధా సంస్థ చేపట్టిన బెలేజ, మెరిడియన్‌ బహుళ అంతస్తుల కాంప్లెక్సుల్లో జీహెచ్‌ఎంసీ అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు జరగలేదని, తగిన సదుపాయాలు కల్పించలేదని బెలేజ, మెరిడియన్‌ అపార్ట్‌మెంట్స్‌ యజమానులు ఆరోపించడంతో గతంలో రెండు పర్యాయాలు జీహెచ్‌ఎంసీ కమిషనర్, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వారితో ‘హియరింగ్‌’జరిపారు. అయినా సమస్య కొలిక్కి రాకపోవడంతో తిరిగి మంగళవారం హియరింగ్‌ ఏర్పాటు చేశారు. దీనికి ఎక్కువ మంది రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. హియరింగ్‌కు ఎనిమిది మందినే పంపిస్తామనడంతో వివాదం మొదలైంది. ఆందోళనకు దిగిన వారిని తరలించాక కమిషనర్‌ బెలేజ, మెరిడియన్‌ అపార్ట్‌మెంట్లలోని కొందరు యజమానులతో హియరింగ్‌ నిర్వహించారు. దీనికి లోధా ప్రతినిధులు హాజరు కాలేదు. హైకోర్టు సూచనలు, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి సమావేశానికి హాజరైన వారికి చెప్పారు.
 
అధికారులు పట్టించుకోవడం లేదు: బాధితులు
జీహెచ్‌ఎంసీ అధికారులు తమ సమస్యలు పరిష్కరించడం లేదని బాధితులు ఆరోపించారు. బెలేజ పేరుతో నాలుగు దశల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతులు పొందిన బిల్డర్‌.. మూడు దశల తర్వాత నాలుగో దశ వాటికి మెరిడియన్‌ అని పేరు పెట్టి.. బెలేజ, మెరిడియన్‌ నడుమ గోడ కట్టారని చెప్పారు. తమకు పార్కింగ్‌ సదుపాయం లేకపోవడంతోపాటు క్లబ్‌హౌస్, ఓపెన్‌ ప్లేస్, స్విమ్మింగ్‌పూల్‌ తదితర సదుపాయాల్లోనూ వ్యత్యాసాలు ఉన్నాయని మెరిడియన్‌ వాసులు ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు తమకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. సెట్‌బ్యాక్‌లు తదితరమైన వాటిల్లోనూ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. బిల్డర్‌పై జీహెచ్‌ఎంసీ తగిన చర్యలు తీసుకోకపోవడంతో బెలేజ, మెరిడియన్‌లోని వారందరికీ సమస్యలు ఏర్పడ్డాయని చెప్పారు.
మరిన్ని వార్తలు