కాలుష్య సాగరం

20 Sep, 2013 03:02 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరవ్యాప్తంగా ప్రతిష్టించిన వేలాది వినాయక విగ్రహాలు చారిత్రక హుస్సేన్‌సాగర్‌లో కలిశాయి. మట్టి గణపతి విగ్రహాల గురించి ఎంతగా ప్రచారం చేసినా.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర హానికారక రంగులు, మిశ్రమాలతో తయారు చేసిన విగ్రహాల సంఖ్య తగ్గలేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. నిమజ్జనం దరిమిలా జలాశయంలోకి సుమారు 20 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 400 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, వంద టన్నుల మేర పీఓపీ సాగర్‌లో కలిశాయని అంచనా.

ఇందులో ఇనుము, కలప తొలగింపు సాధ్యమైనా.. పీఓపీ, హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్‌సాగర్ కలుషితమైందని వారంటున్నారు. జలాశయంలో ప్రస్తుతం ఆక్సిజన్ స్థాయి ‘సున్న’ శాతానికి పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు. సాగర్ కాలుష్యంపై నాలుగేళ్లుగా పరిశోధించిన పర్యావరణవేత్తలు ప్రొఫెసర్ ఎం.విక్రమ్‌రెడ్డి, డాక్టర్ ఎ.విజయ్‌కుమార్ ప్రస్తుతం సాగర్ స్థితిగతులపై సమగ్ర నివేదిక సిద్ధంచేశారు. కాలుష్యానికి కారణమవుతున్న పరిస్థితులు, ప్రత్యామ్నాయాలను పేర్కొన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలివే..

 ప్రమాదం అంచున జలాశయం

 జలాశయంలోకి అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు చేరడంతో ప్రతి లీటరు నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడి) ప్రతి లీటరు నీటికి 100 పీపీఎంగా నమోదైంది. సాధారణ రోజుల్లో ఇది 35-40 పీపీఎం మించదు. ఇక కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడి) లీటరు నీటికి 160 పీపీఎంకు మించింది. సాధారణ రోజుల్లో ఇది 80-100 పీపీఎం మించదు. ఇక నీటిలో ఆక్సిజన్ స్థాయి ప్రతి లీటరు నీటిలో ‘సున్న’గా నమోదైంది. మరోపక్క శుద్ధి ప్రక్రియ మురుగుతోంది. హుస్సేన్‌సాగర్ జలాశయ ప్రక్షాళనకు జైకా రూ.300 కోట్ల రుణం ఇచ్చింది. దీనికి మరో రూ.70 కోట్లు కలిపి హెచ్‌ఎండీఏ మూడేళ్ల క్రితం పనులు చేపట్టింది. ఇప్పటికి 50 శాతమే పూర్తయ్యాయి.

 సాగర్‌లో కలుస్తున్న కాలుష్య కారకాలివే..

 రసాయన రంగుల అవశేషాలు: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, ఆల్కహాల్, తిన్నర్, వార్నిష్.


 హానికారక మూలకాలు: కోబాల్ట్, మ్యాంగనీస్, డయాక్సైడ్, మ్యాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జింక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా.
 
 కాలుష్యకారకాలతో అనర్థాలివే..
హుస్సేన్‌సాగర్‌లోని సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకం

జలాశయంలోని చేపలు తిన్న వారి శరీరంలోకి హానికారక మూలకాలు చేరతాయి. మెర్క్యురీ మూలకం వల్ల మెదడులో సున్నిత కణాలు దెబ్బతింటాయి
     
మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలుతాయి.  
     
నగరంలో జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. జలాల్లో అరుదుగా పెరిగే వృక్షజాతులు అంతర్థానమవుతాయి
     
ఆర్సినిక్, లెడ్, మెర్క్యురీ మూలకాలు భారతీయ ప్రమాణాల సంస్థ, వైద్య పరిశోధన సంస్థలు సూచించిన పరిమితులను మించుతున్నాయి
     
కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనమ్, సిలికాన్‌లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడ్డాయి
     
జలాశయం అడుగున అవక్షేపంగా ఏర్పడిన క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాల్ని తొలగించడం కష్టం
 
 ప్రత్యామ్నాయాలివే..
రంగులు, రసాయనాలు లేని చిన్న పరిమాణంలోని మట్టి వినాయక ప్రతిమలనే సాగర్‌లో నిమజ్జనం చేయాలి. వీటి సంఖ్య ఏటేటా తగ్గించాలి. ఎక్కడి వాటిని అక్కడే నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలి
     
నగరంలో మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాలను నిమజ్జనం చేయరాదు
     
వినాయక విగ్రహాలతోపాటు జలాశయాలంలోకి పూజా సామగ్రి, నూనె, వస్త్రాలు, పండ్లు, ధాన్యం, పాలిథీన్ కవర్లను పడవేయరాదు
     
నిమజ్జనం జరిగిన గంటలోపే వ్యర్థాలను తొలగించాలి
     
పీఓపీతో తయారయ్యే విగ్రహాలను ఎట్టి పరిస్థితిలో నిమజ్జనం చేయరాదు. వాటిని జలాశయం వద్దకు తెచ్చి కొంత నీరు చల్లాలి. వచ్చే ఏడాది మళ్లీ వీటిని వినియోగించేలా ప్రోత్సహించాలి
     
జలాశయంలో వ్యర్థాలు పోగుపడితే దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ వ్యాధులు విజృంభిస్తాయి
 

మరిన్ని వార్తలు