చంద్రబాబు సర్కార్‌పై ప్రధానికి ఫిర్యాదు!

10 Jun, 2016 01:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: విశాఖలో రూ.100 కోట్ల విలువైన జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) భూమిని నామమాత్రపు ధరకే ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడాన్ని కేంద్ర గనులు, ఉక్కు శాఖ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేయాలని ఆ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నిర్ణయించారు. మొత్తం వ్యవహారంపై తక్షణమే తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించినట్లు ఎన్‌ఎండీసీ అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.

విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (వుడా) 1991లో నిర్వహించిన వేలంలో బీచ్ రోడ్డులోని డచ్ హౌస్ లే అవుట్‌లో 2,419 చదరపు గజాల భూమి ని ఎన్‌ఎండీసీ కొనుగోలు చేసింది. ఆ స్థలం లో తమ ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి అనుమతివ్వాలంటూ ఫిబ్రవరి 7, 2013న వుడాకు దరఖాస్తు చేసుకుంది. ఒత్తిళ్ల నేపథ్యంలో.. సదరు భూమిని వెనక్కి తీసుకుంటూ వుడా ఈనెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్‌ఎండీసీ హైకోర్టును ఆశ్రయించింది. వుడా నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఆస్తులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల ఆస్తులకేం రక్షణ ఉంటుందని ప్రశ్నించింది. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంతో పాటు మొత్తం వ్యవహారాన్ని ఎన్‌ఎండీసీ చైర్‌పర్సన్ భారతి.ఎస్.సిహాగ్ గురువారం మంత్రి తోమర్‌కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తోమర్ దీనిపై ప్రధానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు ఎన్‌ఎండీసీ అధికారవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.

దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఎన్‌ఎండీసీ భూమిని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసిన వుడా వైస్ చైర్మన్ బాబూరావు నాయుడుపై వేటు వేసి.. వివాదం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ‘మాస్టర్’ప్లాన్ వేసినట్లు తెలిసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌కు ఆదే శాలు జారీ చేసినట్లు ఆ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.

మరిన్ని వార్తలు