లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం

28 Jan, 2017 01:11 IST|Sakshi

11న జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి శ్రీసుధ
గతేడాది 6,381 కేసులు పరిష్కరించామని వెల్లడి


హైదరాబాద్‌: లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సత్వర న్యాయం అందడమేగాక శాశ్వత పరిష్కారం లభిస్తుందని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి శ్రీసుధ తెలిపారు. ఫిబ్రవరి 11న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం ఆమె లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి వై.వీర్రాజుతో కలసి తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతేడాది సిటీ సివిల్‌ కోర్టు ఆవరణలో ఆరు పర్యాయాలు లోక్‌అదాలత్‌ నిర్వహించి 6,381 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.65 కోట్లు పరిహారంగా అందించామని తెలిపారు. సిటీ సివిల్‌ కోర్టులో 31 వేల పెండింగ్‌ కేసులు ఉన్నాయని, ఇందులో కుటుంబ వివాదాలు, సివిల్‌ కేసులతోపాటు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, చిట్‌ఫండ్, ప్రమాద బీమా, రుణాల రికవరీ కోసం బ్యాంకులు వేసిన కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

వీటిలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న 2 వేల కేసులను గుర్తించి లోక్‌అదాలత్‌లో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలి పారు. ఇందుకోసం బ్యాంకు అధికారులు, న్యాయవాదులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలతో సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజీ ద్వారా పరిష్కరించేందుకు అవకాశం ఉన్న కేసులను గుర్తించి కక్షిదారులకు నోటీసులు పంపుతున్నామని వివరించారు. లోక్‌ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలు గెలిచినట్లేనని, సమ యం, డబ్బు ఆదా అవుతుందన్నారు. లోక్‌అదాలత్‌ ఇచ్చే అవార్డుకు అప్పీల్‌ ఉండదని, ఇక్కడ కేసు పరిష్కరించుకోవడం ద్వారా కోర్టు ఫీజును తిరిగి పొందవచ్చ న్నారు. ప్రీలిటిగేషన్‌ కేసులను కూడా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు అవకాశా న్ని సద్వినియోగం చేసుకొని కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తామని.. మరింత సమాచారం కోసం లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు