పోలీసు పోస్టులకు మూడేళ్లు సడలింపు

22 Dec, 2015 02:13 IST|Sakshi
పోలీసు పోస్టులకు మూడేళ్లు సడలింపు

వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ
ఎస్సై జనరల్ 28 ఏళ్లు, రిజర్వ్ కేటగిరీలో 33 ఏళ్లకు సడలింపు
కానిస్టేబుల్‌కు జనరల్ 25 ఏళ్లు, రిజర్వు 33 ఏళ్ల వరకు అర్హత

 
హైదరాబాద్: పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నేరుగా భర్తీ చేసే పోలీసు ఉద్యోగాలకు ప్రభుత్వం మూడేళ్ల వయసు సడలింపు ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 కింద లభించిన అధికారాల మేరకు నిబంధనలను సవరించారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు గరిష్ట అర్హత వయసును పదేళ్లు సడలించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా పోలీసు నియామకాల్లోనూ వయసు సడలింపు ఇవ్వాలని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం కూలంకషంగా చర్చించి, ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాలు జరిపే పోస్టులకు మూడేళ్లు సడలింపు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి గత నెల 8న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర వేశారు. ఈ లెక్కన ఎస్సై పోస్టులకుగాను జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 25 ఏళ్లు, రిజర్వుడు కేటగిరీలో 30 ఏళ్ల వయో పరిమితి అమల్లో ఉంది. తాజా సడలింపుతో 28 ఏళ్ల వరకు ఉన్న జనరల్ అభ్యర్థులు, 33 ఏళ్ల వయసున్న రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు కూడా పోటీపడేందుకు అర్హులవుతారు. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయో పరిమితి జనరల్ కేటగిరీలో 22 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు, రిజర్వుడు కేటగిరీలో 27 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పెరగనుంది.

ఫిబ్రవరిలో నోటిఫికేషన్!
9,096 పోలీసు కొలువులకు వచ్చే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముంది. వీటికి ఇప్పటికే ఆర్థిక, న్యాయ శాఖలు, టీఎస్‌పీఎస్సీ అనుమతి లభించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. వచ్చే నెలలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోలీసు కొలువుల భ ర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు