ఊపందుకున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత

27 Sep, 2016 14:42 IST|Sakshi
ఊపందుకున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ : నగరంలోని నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు వేగవంతం చేశారు. నగరంలో పెద్ద ఎత్తున ఆక్రమణల తొలగింపు పనులు రెండో రోజు జరుగుతున్నాయి. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, నీటి పారుదల, పోలీసు శాఖల అధికారులతో 24 బృందాలు కూల్చివేత పనులను కొనసాగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల సాయంతో అక్రమణ కట్టడాలను తొలగిస్తున్నారు. మంత్రి కేటీఆర్ నగరంలో కూల్చివేతలపై అధికారులతో ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు.
 
అక్రమ భవనాల కూల్చివేతకు అడ్డుపడొద్దని ఎమ్మెల్యేలు, అధికారులకు ఇప్పటికే సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ భవనాలు కూల్చడానికి వెళ్లే అధికారులు ముందస్తుగా పక్కా సమాచారంతో వెళ్లాలని సూచించింది. నిర్మాణ కూల్చివేతలను యజమానులు అడ్డుకుంటే అధికారులు డాక్యుమెంట్లను చూడడంతో పాటు వాటిని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. 
 
గచ్చిబౌలి, మీర్ పేట్, రాజేంద్రనగర్, ఉప్పల్, రామంత పూర్, కాప్రా, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. శేరిలింగంపల్లిలో నాలాలపై ఉన్న నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. ఆదర్శనగర్, శాంతినగర్, దీప్తిశ్రీనగర్లో దాదాపు 2కి.మీ. మేర ఆక్రమణలు జరిగినట్లు గ్రేటర్ సిబ్బంది గుర్తించారు. మీర్ పేట్ హస్తిన పురంలో డీసీ పంకజం ఆధ్వర్యంలో, చాదర్ ఘాట్ మూసా నగర్ బస్తీలో డీసీ కృష్ణ శేఖర్ నేతృత్వంలో ముందస్తుగా నోటీసులు జారీ చేసారు. వాహెద్ నగర్, శంకర్ నగర్, పద్మ నగర్ బస్తీల్లో అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. 
 
ఆరంఘర్ చౌరస్తాలో పీవీ ఎక్స్ ప్రెస్ వే సమీపంలో అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. మల్కాజిగిరిలోని షిరిడి నగర్లో, ఉప్పల్ పరిధిలోని హబ్సిగూడ, లక్ష్మీనగర్ లలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. కర్మన్ ఘాట్ లోని ఉదయ్ నగర్ కాలనీలో నాలాలపై ఆక్రమించిన ఇళ్లను డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. రామంతపుర్ పెద్ద చెరువు సమీపంలో నిర్మాణంలో ఉన్న కాంపౌడ్ వాల్ను అధికారులు కూల్చివేశారు.
>
మరిన్ని వార్తలు