మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో రూ.10 వేల కోట్లు

2 Jul, 2016 04:21 IST|Sakshi
మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో రూ.10 వేల కోట్లు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల్లో రూ.10 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు మలేసియా ప్రభుత్వ రంగ సంస్థ కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బోర్డు(సీఐడీబీ) సుముఖత వ్యక్తం చేసింది. జాతీయ రహదారులు, ప్రజా రవాణా, గృహ నిర్మాణం తదితర రంగాల్లో దీర్ఘకాలంలో ఈ పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వచ్చింది. 3 రోజులుగా సింగపూర్, మలేసియాలో పర్యటిస్తున్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు.. శుక్రవారం సీఐడీబీ సీఈవో అబ్దుల్ లతీఫ్ హిటామ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేటీఆర్ ఆయనకు వివరించారు.

దేశీయంగా నిర్మాణ రంగంలో సేవలు, పెట్టుబడులతో పాటు.. ఎగుమతులను ప్రోత్సహించడం లక్ష్యంగా మలేసియా ప్రభుత్వం సీఐడీబీని ఏర్పాటు చేసిందని సీఈవో హిటామ్ వెల్లడించారు. ‘గోయింగ్ గ్లోబల్’ విధానంలో భాగంగా తమ వద్ద ఉన్న నిధులను సీఐడీబీ సోదర సంస్థ సీఐడీబీ హోల్డింగ్స్ ద్వారా విదేశీ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో రహదారుల నిర్మాణానికి రాజస్తాన్ ప్రభుత్వంతో తమ సంస్థ ఇప్పటికే పరస్పర అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు హిటామ్ వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఐడీబీ సుముఖత వ్యక్తం చేయడాన్ని స్వాగతించిన కేటీఆర్.. సంస్థ కార్యకలాపాలకు సహకారం అం దిస్తామని ప్రకటించారు. మలేసియా పెట్టుబడులతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం లభిస్తుందని తెలిపారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు ఏటా తిరిగి చెల్లించే విధానంలో.. స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఉంటాయన్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై అధ్యయనం చేసేందుకు త్వరలో సీఐడీబీ బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని కేటీఆర్ చెప్పారు.

 వ్యాక్సిన్ల తయారీలో పెట్టుబడులు
 తెలంగాణలో వ్యాక్సిన్ల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మలేసియాకు చెందిన అతిపెద్ద ఫార్మా కంపెనీ ‘కెమికల్ కంపెనీ ఆఫ్ మలేసియా’ సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థ ఎండీ ఆరిఫ్ అబ్దుల్ షతార్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఫార్మా కంపెనీలకు తెలంగాణ కేంద్రంగా ఉందని.. ఫార్మాకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ చెప్పారు. తమ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో పలు కంపెనీలతో వివిధ రంగాల్లో కలసి పనిచేస్తున్నట్లు ఆరిఫ్ వెల్లడించారు. అనంతరం వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ఎల్‌కేఎల్ ఎండీ లిమ్ కోన్ లియాన్‌తోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొల్పుతున్న మెడికల్ డివెజైస్ పార్కులో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ప్రతినిధి బృందాన్ని పంపిస్తామని లియాన్ హామీ ఇచ్చారు. ఏవియేషన్ రంగంలో శిక్షణ కార్యకలాపాల్లో కలసి రావాల్సిందిగా ఏసియా ఏరోటెక్నిక్ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్.. కేటీఆర్ వెంట భేటీల్లో పాల్గొన్నారు. కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
 
 ప్రధాని సలహాదారుతో సమావేశం
 ప్రభుత్వ పథకాల అమలును రోజూవారీగా పర్యవేక్షించేందుకు మలేసియా తరహాలో ‘పెమండు’(పెర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ డెలివరీ యూనిట్) ‘డ్యాష్ బోర్డు’ వ్యవస్థ ఏర్పాటును పరిశీలిస్తామని కేటీఆర్ వెల్లడించారు. జాతీయ పరివర్తన పథకం ‘పెమండు’ అధినేత, మలేసియా ప్రధాని సలహాదారు డాటో శ్రీ ఇద్రిస్ జాలాతో కేటీఆర్ భేటీ అయ్యారు. 2020 నాటికి మలేసియాను అధిక ఆదాయ దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పెమండును ఏర్పాటు చేసినట్లు ఇద్రిస్ చెప్పారు. ప్రభుత్వ శాఖల పనితీరును డ్యాష్‌బోర్డుల ద్వారా పెమండు పర్యవేక్షిస్తున్న విధానాన్ని కేటీఆర్ అభినందించారు. పెమండు తరహాలో రాష్ట్రంలోనూ.. మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు అవసరమని, తద్వారా స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడం సులభమవుతుందన్నారు.

మరిన్ని వార్తలు