మృత్యు వాహనం

2 Apr, 2016 02:46 IST|Sakshi
మృత్యు వాహనం

బస్టాప్‌లో  పాలిటెక్నిక్ విద్యార్థిని ఢీ కొట్టిన స్కూల్ వ్యాన్
తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి.. నల్లకుంటలో ఘటన
మృతుడు కరీంనగర్ జిల్లాకు చెందిన సాయిప్రకాశ్‌గా గుర్తింపు

హైదరాబాద్: బస్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని స్కూల్ వ్యాన్ రూపంలో మృత్యువు కబళిం చింది. నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం గొల్లపల్లికి చెందిన బూస సాయిప్రకాశ్(21) ఇబ్రహీం పట్నంలోని రాజమహేంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ డిప్లమా మూడో సంవత్సరం చదువుతున్నాడు. దీంతో పాటు వీఎస్టీలో అప్రెంటీస్ చేస్తున్నారు.

ఓయూలో ఎంసీజే చదువుతున్న సోదరుడు సతీశ్ హాస్టల్ రూమ్‌లో నాన్‌బోర్డర్‌గా ఉంటున్నాడు. శుక్రవారం వీఎస్టీకి వెళ్లేందు కు ఉదయం 6.35 గంటలకు లక్కీ కేఫ్ చౌరస్తాలోని బస్టాప్ వద్ద బస్సు కోసం సాయిప్రకాశ్ వేచి చూస్తున్నాడు. అదే సమయంలో ఓయూ నుంచి పాఠశాల విద్యార్థులను తీసుకుని వస్తున్న మెటాడోర్(ఏపీ 10టీ3022) వ్యాన్ అదుపు తప్పి సాయిప్రకాశ్‌ను బలంగా ఢీకొంది. దీంతో సాయిప్రకాశ్ తలకు బలమైన గాయా లై అక్కడికక్కడే మృతిచెందాడు. వ్యాన్ అదే వేగంతో దూసుకెళ్లి బస్టాప్ పక్కనే ఉన్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాం క్ వద్ద ఫుట్‌పాత్ పైకి ఎక్కి కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టింది. పెద్దగా శబ్దం రావడంతో అక్కడి ఏటీఎం వద్దనున్న సెక్యూరిటీ గార్డు నర్సింహా పరుగెత్తుకు వచ్చి వ్యాన్‌లో భయం తో ఏడుస్తున్న విద్యార్థులను బయటకు తీశాడు.

పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు. పోలీసు లు ప్రమాద స్థలానికి చేరుకుని సాయిప్రకాశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి పెదనాన్న కుమారుడు పి.నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన రామంతాపూర్ రాంరెడ్డినగర్‌కు చెందిన మెటాడోర్ డ్రైవర్ బి.లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని సాయిప్రకాశ్ కుటుంబ సభ్యులకు అప్పగించారు. వాహనం బ్రేకు లు ఫెయిలై ప్రమాదం జరిగిందా.. మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు