కలుషిత నీరు తాగి ఏడుగురికి అస్వస్థత

25 Jun, 2015 04:01 IST|Sakshi
కలుషిత నీరు తాగి ఏడుగురికి అస్వస్థత

నల్లకుంట : కలుషిత నీరు తాగిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురిని చికిత్సల కోసం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చేర్పించగా, మరో ఇద్దరు చిన్నారులను విద్యానగర్‌లోని ఓ ప్రైవేట్ చిన్నపిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. సికింద్రాబాద్ వారాసిగూడ షాహబాజ్‌గూడకు చెందిన సర్దార్ అలీ కుటుంబసభ్యులు నల్లాల ద్వారా సరఫరా అయిన కలుషిత నీటిని తాగారు. దీంతో వీరి ఇంట్లో ఖతిజా ఫాతిమా(32), అమీనా బేగం(60), జహంగీర్ బాబా(21), సోహైల్ అలీ(14), అక్బర్ అలీ(23), మోసిన్ అలీ(2), రశ్వాబేగం(ఏడాదిన్నర)లు వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

వీరిని మంగళవారం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న మహమూద్‌గూడ అండ్ షాహ్‌బాజ్‌గూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ శంషుద్దీన్, అజ్గర్‌లు బుధవారం బాధితులు చికిత్సలు పొందుతున్న ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. దీంతో అసోసియేషన్ ప్రతినిధులు అస్వస్థతకు గురైన వారిని మెరుగైన చికిత్సల కోసం ఫీవర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వారిని పరీక్షించిన వైద్యులు సస్పెక్టెడ్ వాటర్ పాయిజన్ కేసుగా నమోదు చేసి, ఇన్‌పేషంట్లుగా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నారు. కాగా అస్వస్థతకు గురైన మరో ఇద్దరు చిన్నారులను విద్యానగర్‌లో గల ఓ పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు.

మరిన్ని వార్తలు