ఎస్సై ఫలితాలు మరింత జాప్యం!

12 Jun, 2017 01:52 IST|Sakshi
ఎస్సై ఫలితాలు మరింత జాప్యం!
మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ కొనసాగుతుండటం వల్లే...
 
సాక్షి, హైదరాబాద్‌: గతేడాది నవంబర్‌లో జరిగిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) తుది పరీక్ష ఫలితాల విడుదలపై సందిగ్ధత నెలకొంది. మొత్తం 539 ఎస్సై, ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు తుది పరీక్ష జరగ్గా ఫలితాలపై ఇప్పటివరకు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. అయితే రాష్ట్ర పోలీసు అకాడమీలో ప్రస్తుతం 2,800 మందికిపైగా మహిళా కానిస్టేబుళ్లు శిక్షణలో ఉన్న నేపథ్యంలో ఎస్సై ఫలితాలు ప్రకటిస్తే కొత్తగా వచ్చే 539 మంది ఎస్సై, ఫైర్‌ ఆఫీసర్లకు ఒకే సమయంలో శిక్షణ ఇవ్వడం సాధ్యంకాదని పోలీసు ట్రైనింగ్‌ విభాగం భావిస్తోంది.

మొత్తం 9 నెలల కానిస్టేబుళ్ల శిక్షణను ప్రస్తుతం రెండు సెమిస్టర్లుగా విభజించారు. అందులో భాగంగా మొదటి మూడున్నర నెలలు శిక్షణ ముగిస్తేనే ఎస్సై ఫలితాలపై కొంత ముందుకెళ్లే అవకాశం ఉందని శిక్షణ విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. ఒకేసారి రెండు విభాగాలకు శిక్షణ ఇవ్వడం కుదరదని శిక్షణ విభాగం తేల్చిచెప్పడంతో రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఫలితాలపై వెనక్కి తగ్గిందన్న వాదన వినిపిస్తోంది. కానిస్టేబుల్‌ శిక్షణ ప్రారంభమై దాదాపు నెలన్నరకాగా మరో నెలన్నర దాటితేగానీ ఎస్సై ఫలితాలు రావన్నది పోలీసుశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు కానిస్టేబుల్‌ ఫలితాల్లో రిజర్వేషన్‌ అమలు తీరు, కటాఫ్‌ వంటి అంశాలపై 143 మంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లడం, కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థుల ఎంపికకు ఒకే రకమైన విధానాలుండటంతో ఈసారి రోస్టర్, కటాఫ్, రిజర్వేషన్‌ తదితరాలను పకడ్బందీగా అమలు చేసి ఫలితాలు ప్రకటించాలని బోర్డు భావిస్తున్నట్లు తెలిసింది.  
మరిన్ని వార్తలు